జడ్పీ పనులకు మోకాలడ్డు
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:57 AM
జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జిల్లా పరిషత్ నిధులతో చేపడుతున్న పనులకు లేని ఇబ్బంది ఎలమంచిలి నియోజకవర్గంలో వస్తున్నదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు చేయనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు.
అధికారులపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు ఒత్తిడి తెస్తున్నారు
జడ్పీ సమావేశంలో పలువురు సభ్యులు ధ్వజం
పోడియంను చుట్టుముట్టి నిరసన
పనులు జరిగేటట్టు చూస్తానని కలెక్టర్ విజయకృష్ణన్ హామీ
ప్రమాదాల మృతులకు ఒకే తరహాలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఎమ్మెల్యే బండారు ప్రతిపాదనకు సమావేశం ఆమోదం
ఔషధ దుకాణాల్లో కాలంతీరిన మందులు అమ్ముతున్నారు
పరవాడ ఫార్మా సిటీ నుంచి విషవాయువులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణుల కొరత
జలజీవన్ మిషన్ పనులపై గోప్యంత ఎందుకు?
జడ్పీ సమావేశంలో సమస్యలను లేవనెత్తిన సభ్యులు
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జిల్లా పరిషత్ నిధులతో చేపడుతున్న పనులకు లేని ఇబ్బంది ఎలమంచిలి నియోజకవర్గంలో వస్తున్నదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు చేయనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై చర్చ జరిగినప్పుడు పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు మాట్లాడుతూ, ఎలమంచిలి నియోజకవర్గంలో జడ్పీ నిధులతో పనులు జరగడంలేదని సహచర సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని దీనిపై చైర్‌పర్సన్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎలమంచిలి నియోజకవర్గంతోపాటు ఇతర మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు చైర్‌పర్సన్ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో చైర్‌పర్సన్ స్పందిస్తూ ‘ఎలమంచిలి’లో నిధుల వ్యయంపై గతంలో ఒకసారి సభ్యులు ప్రస్తావించారని గుర్తుచేశారు. అప్పట్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చినా.. ఇంత వరకు సమస్య పరిష్కారంకాలేదని అన్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, పనులు జరిగేటట్టు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో సభ్యులు శాంతించారు.
సమావేశం ప్రారంభంకాగానే కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించనందునే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అన్ని బాణసంచా తయారీ కేంద్రాలను తహసీల్దారు, ఎస్‌ఐ, ఎంపీడీవోల నేతృత్వంలోని కమిటీ ప్రతి నెల తనిఖీచేస్తే భవిష్యత్తులో ప్రమాదాలను అరికట్టవచ్చునన్నారు. బాణసంచా ప్రమాదంతోపాటు ఫార్మా, ఇతర కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు చెల్లించే పరిహారంలో వ్యత్యాసం వుంటున్నదని, దీంతో తగిన నష్టపరిహారం కోసం ఫార్మా కంపెనీల వద్ద బాధిత కుటుంబాలు ధర్నాలు చేస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఒకే విధమైన పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ఒక విధానం రూపొందించాలని కోరుతూ జడ్పీ తీర్మానం చేయాలని కోరారు. ఇందుకు సమావేశం ఆమోదించింది. పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు మాట్లాడుతూ, పరవాడ ఫార్మాసిటీలోని పలు కంపెనీల నుంచి విడుదలయ్యే విషవాయువులతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని నివారించడానికి ఆయా కంపెనీలు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.
ఆస్పత్రుల్లో వైద్యుల కొరత
వైద్య, ఆరోగ్య శాఖపైలో జరిగిన చర్చలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో గైనిక్, ఆర్థోపెడిక్, చిన్నపిల్లల వైద్యులను తక్షణమే నియమించాలని, అన్ని సీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే బండారుతోపాటు కోటవురట్ల, చింతపల్లి, పెదబయలు జడ్పీటీసీ సభ్యులు సిద్ధాబత్తుల ఉమాదేవి, పోతుల బాలయ్య, బొంజిబాబు కోరారు. అనంతగిరి మండలంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎస్.కోటలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కాకుండా విజయనగరం తీసుకెళుతున్నారని, దీనివల్ల మెరుగైన వైద్యం అందడంలేదని జడ్పీటీసీ సభ్యుడు డి. గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా జేసీ అభిషేక్ గౌడ స్పందిస్తూ.. సమస్యను పరిష్కరిస్తానన్నారు. అనకాపల్లి జిల్లాలో మందుల దుకాణాలపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లేదని, కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదుచేసినా ఎవరు పట్టించుకోవడంలేదని బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు ఆరోపించారు. ఽఎమ్మెల్యే బండారు జోక్యంచేసుకుని... ఉమ్మడి జిల్లాలో అన్ని మందుల దుకాణాలను తనిఖీచేసి వచ్చే సమావేశంలో ఒక నివేదిక అందజేయాలని కోరారు.
అంతకుముందు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టరు శివానంద్ మాట్లాడుతూ, కేజీహెచ్‌లో వారం రోజులపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తున్నామని, దీనిని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మార్చురీ గది వద్ద పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుచేశామన్నారు. వేసవిలో వడదెబ్బకు గురైన వారికి చికత్స అందించడం కోసం ఆరు బెడ్లతో ఉన్న ఏసీ గదిని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ కౌంట్లు ఓపెన్ చేశామని చెప్పారు.
జలజీవన్ మిషన్ పనులపై గోప్యంత ఎందుకు?
జిల్లాలో జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పనులపై గోప్యత ఎందుకని, కనీసం సర్పంచ్‌కు కూడా సమాచారం ఇవ్వడంలేదని చైర్‌పర్సన్ సుభద్ర మండిపడ్డారు. గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలు సర్పంచ్‌కు చెప్పకపోతే ఎలా అని అధికారులను నిలదీశారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ పనుల్లో లోపాలు ఉన్నాయని, చాలాచోట్ల నీరు రావడంలేదని అన్నారు. దీనిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చౌదరి హామీ ఇచ్చారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం నీటి పథకాలు, బోర్లుకు మరమ్మతులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అరకులోయ ఎంపీ తనూజరాణి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ‘సామాజిక’ కార్పొరేషన్ల చైర్మన్లు పీవీజీ. కుమార్, మళ్ల సురేంద్ర, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బండారు వర్సెస్ అనురాధ
కె.కోటపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణంపై మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాఠశాలకు ప్రస్తుతం ప్రహరీ గోడ ఉండగా, లోపలకు 10 అడుగుల దూరంలో మరో గోడ ఎందుకు నిర్మిస్తున్నారని అనురాధ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర శిక్ష అధికారులు వివరణ ఇస్తుండగా.. ఆమె తన వాదనను కొనసాగించడంతో బండారు జోక్యం చేసుకున్నారు. మెయిన్‌రోడ్డును విస్తరించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా లోపల నుంచి ప్రహరీగోడ నిర్మించాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ తీర్మానించిందన్నారు. మళ్లీ అనురాధ మాట్లాడుతూ, మెయిన్‌రోడ్డునుు ఆనుకుని పాఠశాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించగా.. బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కబ్జాలను సహించేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడిన వ్యక్తులపై ఇప్పుడు విచారణ జరుగుతున్నదని అన్నారు.
చోడవరం ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చేపట్టిన పలు నిర్మాణాలకు నిధులు విడుదల చేయలేదని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని కోరారు. ఏయే పథకాల కింద ఎన్ని పనులు అసంపూర్తిగా వున్నాయి? వాటిని పూర్తిచేయడానికి ఎన్ని నిధులు అవసరం? వంటి వివరాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఇందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.