వీఎంఆర్‌డీఏ ఈ-వేలంపై పెదవివిరుపు
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:28 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇళ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లకు నిర్వహిస్తున్న ఈ-వేలంపై అనుమానాలు కలుగుతున్నాయి.
పాటదారుల సమాచారాన్ని సిబ్బంది లీక్ చేస్తున్నట్టు అనుమానం
ఫోన్లు చేసి పోటీదారుల బెదిరింపులు
అందుకే అప్‌సెట్ ధరపై ఎక్కువ రేటు రావడం లేదనే ఆరోపణలు
ప్లాట్లకు తగ్గుతున్న దరఖాస్తులు
పాత విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించాలని యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇళ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లకు నిర్వహిస్తున్న ఈ-వేలంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇది అందరికీ అనుకూలంగా లేదని, కొందరికీ లాభదాయకంగా ఉందని చెబుతున్నారు.
గతంలో ఏదైనా స్థలం వేలం వేయాలంటే వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ప్రత్యక్షంగా వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు పాడితే వారికే విక్రయించేది. అయితే కొత్తగా వేసిన లేఅవుట్లలో ప్లాట్లకు వేలం నిర్వహించినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొని, ఆ చుట్టుపక్కల గల వారి లేఅవుట్ల ధరలు పెంచుకునేందుకు ఒకటి, రెండు ప్లాట్లు మాత్రం ఎక్కువకు పాడేవారు. మిగిలిన ప్లాట్ల వేలంలో పాల్గొనేవారు కాదు. అధికారులు ఆ ప్లాట్లకు ఎక్కువ ధర పలికింది కాబట్టి మిగిలిన వాటిని కూడా అదే ధరకు అమ్మాలని చూసేవారు. అంతకంటే తక్కువకు పాడిన వారికి ఇచ్చేవారు కాదు. నిబంధనలు అంగీకరించవని చెప్పేవారు. దాంతో ఎవరూ కొనడానికి ముందుకు వచ్చేవారు కాదు. దీనివల్ల వీఎంఆర్‌డీఏ లేఅవుట్లలో వందల కొద్దీ ప్లాట్లు మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.
నష్టం తప్పించుకోవాలని...
రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం పాటల్లో పాల్గొంటున్నారని అంతా ఆరోపించడంతో ఎవరు వేలం పాట పాడుతున్నారో తెలియకుండా ఉండేందుకు కొత్తగా ‘ఈ-వేలం’ అమలులోకి తీసుకువచ్చారు. ఈ విధానంలో పాటదారులు వారి ఇల్లు, ఆఫీసులో కూర్చొనే పాటలో పాల్గొనవచ్చు. పాటదారులు ఎవరో అఽధికారులకు తప్ప ఇతరుకు తెలియదు. దీనివల్ల పోటీ ఉండదని, అవసరమైన వారు పాడుకుంటారని అనుకున్నారు. కానీ ఇది కూడా సవ్యంగా సాగడం లేదు. వీఎంఆర్‌డీఏలో ఈ వ్యవహారాలు చూసే సిబ్బందిని కొందరు మచ్చిక చేసుకున్నారు. పాటదారుల సమాచారం వారు బయటకు చేరవేయడం ప్రారంభించారు. ఏదైనా డిమాండ్ ఉండి పాటకు పోటీ పెరుగుతుంటే...అవతల వైపు పాడుతున్న వారి వివరాలు (ఫోన్ నంబరు, పేరు) రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందిస్తున్నారు. దాంతో ఆయా నంబర్లకు ఫోన్ చేసి, తాము ఎంతైనా పాడుకుంటామని, పోటీ పడితే నష్టమని, వెనక్కి తగ్గిపోతే ‘బహుమానం’ ఇస్తామని చెప్పి వారిని పోటీ నుంచి తప్పించడం మొదలుపెట్టారు. దీనివల్ల వీఎంఆర్‌డీఏకు అప్‌సెట్ ధర మీద ఎక్కువ రేటు రావడం ఆగిపోయింది. ఇలాంటి బెదిరింపుల వల్ల చాలామంది వీఎంఆర్‌డీఏ ప్లాట్లకు దరఖాస్తు చేయడం తగ్గించేశారు. మరోవైపు విశాఖ పరిసరాల్లో భూముల రేట్లు కూడా పెరిగిపోవడంతో అంతంత రేటు పెట్టి, వేలంలో పాడాల్సిన అవసరం ఏమిటని చాలామంది ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ-వేలం పాటకు ఆదరణ తగ్గిపోయింది.
ప్రత్యక్ష వేలంపై ఆలోచన చేస్తున్నాం
ప్రణవ్ గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ
వీఎంఆర్‌డీఏ ఈ-వేలం పాటలపై చైర్మన్ ప్రణవ్ గోపాల్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రస్తావించగా, అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో కొందరు వేలం పాటదారుల సమాచారం లీక్ చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే మరొకరు లీక్ చేస్తారని, అందుకే వేలం పాటలు పూర్వంలాగే ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని ఆలోచిస్తున్నామని, దీనిపై అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.