నేటి నుంచి ముత్యాలమ్మ జాతర
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:04 AM
మన్యం ప్రజల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాతర గురువారం ప్రారంభంకానున్నది. నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
భక్తులకు వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
చింతపల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మన్యం ప్రజల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాతర గురువారం ప్రారంభంకానున్నది. నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని పోలీసు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘన చరిత్ర
చింతపల్లి ముత్యాలమ్మ అమ్మవారి జాతరను సుమారు 110 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. తొలి రోజుల్లో మూడు రోజుల పాటు జాతరను నిర్వహించగా, 15 ఏళ్ల క్రితం నుంచి నాలుగు రోజులకు పెంచారు. ఈ జాతరలో గురువారం అమ్మవారి ఆలయంలో సాధారణ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం అమ్మవారి గరగలు(పాదాలు) సుర్లవారి వంశీయుల స్థావరాల నుంచి సతకంపట్టు వద్దకు తీసుకు వస్తారు. అమ్మవారి గరగలకు సతకంపట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శనివారం సాయంత్రం చింతపల్లి పురవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం సుర్లవారి స్థావరాలకు అమ్మవారి పాదాలను తరలిస్తారు. ఆదివారం అనుపోత్సవం నిర్వహిస్తారు. జాతర సందర్భంగా స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్, సాయిబాబా ఆలయం నుంచి సంతబయలు వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు వసతుల కల్పనపై స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి పెట్టారు. ఏఎస్సీ నవజ్యోతి మిశ్రా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి భక్తులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 60 మంది వలంటీర్లను నియమించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దురియా హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వినాయకరావు తెలిపారు. రెండు వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు వారు చెప్పారు.