Share News

నాటుసారా అడ్డా.. డప్పుగుడ

ABN , Publish Date - Apr 18 , 2025 | 10:28 PM

అరకులోయ ప్రాంతంలో నాటుసారా ఏరులా ప్రవహిస్తోంది. ఏ గ్రామంలో చూసినా సారా దొరుకుతోంది. మూరుమూల ప్రాంతాల్లో తయారైన నాటుసారా మండల కేంద్రాలకు దర్జాగా రవాణా అవుతోంది. ముఖ్యంగా నాటుసారా తయారీకి గిన్నెల పంచాయతీ డప్పుగుడ అడ్డాగా మారింది. ఇక్కడ తయారైన సారా అనంతగిరి, అరకులోయ మండలాల్లో అన్ని గ్రామాలకు, ఒడిశా సరిహద్దు హంపవల్లి పరిసరా గ్రామాలకు రవాణా అవుతోంది. సారా ఇష్టానుసారంగా తాగి గ్రామాల్లో గొడవలు, కొట్లాటలు, హత్యలు, సజీవ దహనాల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నాటుసారా అరికట్టాల్సిన ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాటుసారా అడ్డా.. డప్పుగుడ
డప్పుగుడ చాపరాయి దిగువన సారా తయారీకి ఉపయోగపడే పొయ్యిలు

తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామం

రెండు మండలాలకు సరఫరా

పత్తా లేని ఎక్సైజ్‌ శాఖ

సారాతోనే గ్రామాల్లో గొడవలు, హత్యలు

సారా తయారీని అరికట్టాలని గిరిజన మహిళల డిమాండ్‌

అరకులోయ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అరకులోయకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గన్నెల పంచాయతీ డప్పుగుడ గ్రామం నాటుసారా తయారీ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామం నుంచే మూడు మండలాల్లోని గ్రామాలకు పెద్ద ఎత్తున నాటుసారా సరఫరా జరుగుతోంది. నాటుసారాతో తమ గ్రామాల్లో గొడవలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, అయినా ఎక్సైజ్‌, పోలీస్‌ యంత్రాంగాలు స్పందించడం లేదని గిరిజనం ఆరోపిస్తోంది. అనంతగిరి మండలం బొర్రా, కోనాపురం పంచాయతీల్లోని గ్రామాల వారు డప్పుగుడ గ్రామం నుంచి నాటుసారా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సారాతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని ఇటీవల గిరిజనుడి హత్య జరిగిన రోజున పరిసర గ్రామాల మహిళలు డప్పుగుడ చేరుకొని సారా తయారీ అరికట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో నాటుసారాను తాగి మగవాళ్లు ఒళ్లు తెలియనంత మైకంలో పడి ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా డప్పుగుడ, కొసిగుడ గ్రామాలలో నాటుసారా బట్టీలకు ధ్వంసం చేయాలని, నాటుసారాను గ్రామాల్లో లేకుండా నిరోధించాలని గిరిజన మహిళలు డిమాండ్‌ చేశారు.

డప్పుగుడ టూ మూడు మండలాలు

మారుమూల డప్పుగుడ, కొసిగుడ గ్రామాల్లో తయారీ అయిన నాటు సారా మూడు మండలాల్లోని గ్రామాలకు రవాణా జరుగుతోంది. ఇక్కడ తయారైన నాటు సారా అరకులోయ మండలంలో లోతేరు, గన్నెల, మాదాల, చినలబుడు, తదితర గ్రామాలకు చేరుతోంది. అలాగే అనంతగిరి మండలం కోనాపురం, తరైగుడ, బుర్రా తదితర గ్రామాలకు చేరుతోంది. అలాగే ఒడిశా సరిహద్దు హంపవల్లికి రవాణా జరుగుతోంది. ఈ గ్రామాల నుంచి పరిసర గ్రామాలకు నాటుసారా తరలుతోంది. దీంతో అరకులోయ, అనంతగిరి మండలాల్లో నాటుసారా పుష్కలంగా లభ్యమవుతోందని గిరిజనులు తెలిపారు.

పత్తా లేని ఎక్సైజ్‌ శాఖ

ఏజెన్సీలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడుల విషయంలో ఎక్సైజ్‌ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పాంతంలో నాటుసారా నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా సారా తయారీ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన దాఖలాలు అసలు లేవు. ఆశాఖ సిబ్బంది మారుమూల గ్రామాలను వెళ్లకపోవడంతో పెద్ద ఎత్తున నాటుసారా తయారీ జరుగుతోందని గిరిజనులు అంటున్నారు. దీంతో నాటుసారా బట్టీలు, తయారీ కేంద్రాలు వెలిసిపోతున్నాయి. రవాణాకు చక్కటి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామాల్లో సారా కిక్‌తో ఘర్షణలు, గొడవలు, హత్యలు, తదితరాలు జరుగుతున్నాయని గిరిజనులే అంటున్నారు. ఈ అకృత్యాలకు విసుగెత్తిన గిరిజన మహిళలు సారా తయారీ కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ నవోదయం పేరిట చేస్తున్న అవగాహన కార్యక్రమాలు అల్లూరి జిల్లాలోని అన్ని గిరిజన గ్రామాల్లో చేపట్టాలని వారు కోరుతున్నారు. గిరిజన గ్రామాల్లో నాటుసారాతో పాటు మూఢనమ్మకాల వల్ల కక్షలు పెరిగి ఘర్షణలు, గొడవలు, కొట్లాటలు, హత్యలకు దారి తీస్తున్నాయి. గ్రామాలపై నాటుసారా వ్యాపారాన్ని కట్టడి చేస్తే వీటిని చాలా వరకు అరికట్టవచ్చు. నాటుసారా తాగి ఆరోగ్యం పాడైతే చెడుపు, చిల్లంగి చేశారంటూ గొడవలు జరుగుతున్నాయి. అవి చివరకు కొట్లాటలు, హత్యలు, సజీవ దహనాల వరకు వెళుతున్నాయి. ఈ సమయంలో మూఢనమ్మకాలు పెరిగి గిరిజన గ్రామాల్లోని గురువులను ఆశ్రయించడం, వారు గ్రామాలలో ఉన్న కొంతమంది పేర్లు అంచనాగా చెప్పడంతో దారుణాలు జరుగుతున్నాయి.

అవగాహన కల్పించడమే మార్గం

నాటుసారా, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలి. తరచూ గ్రామాల్లో వారిని వీధి నాటకాలు, చిన్న సినిమాలు వంటి వాటి ద్వారా చైతన్యపరచాలి. పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు గ్రామాల్లో అవగాహన పెంచేందుకు తరచూ పర్యటనలు చేయాలి. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను కూడా వివరించాలి. అనారోగ్యం బారిన పడితే గురువుల వద్దకు కాకుండా ఆస్పత్రులకు వెళ్లాలని గిరిజనులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలాకాకుండా గురువుల వద్దకు వెళితే కుటుంబానికి జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించగలగాలి. అలాగే అధికార యంత్రాంగం గిరిజన గ్రామాల్లో గురువులను కట్టడి చేయాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే అవగాహన సదస్సులు అంటూ హంగామా చేయకుండా నిరంతరం కొన్నాళ్లపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖ ఉద్యోగులను భాగస్వామ్యులను చేయాలి. ఇలా చేయడం వల్ల నాటుసారాతోపాటు గంజాయి, మూఢనమ్మకాలకు కొంతమేరకు చెక్‌ పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 18 , 2025 | 10:28 PM