విమానాశ్రయంపై నిర్లక్ష్యం!
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:48 AM
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి.
విమానాలు రద్దయినా స్పందించని కేంద్ర మంత్రి
భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలతో పాటు విశాఖ ఎయిర్‌పోర్టుపైనా దృష్టి పెట్టాలని నగరవాసుల విన్నపం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు ఒక్కొక్కటిగా రద్దయిపోతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర రాజఽధాని విజయవాడకు విమానంలో వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకాక్, మలేషియాలకు బుకింగ్స్ నిలిచిపోయాయి.
పర్యాటకంగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం విదేశీ విమానాలు ఆగిపోతే ఇక పర్యాటకులు ఎలా వస్తారనేది ఆలోచించడం లేదు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు పక్క జిల్లాలోనే ఉంటారు. ఆయన ప్రతి నెలా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా వెళ్లి సమీక్షిస్తున్నారు. గురువారం విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై దేశ రాజధాని ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. మరి విశాఖ విమానాశ్రయం సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఎక్కడికైనా సరే విశాఖపట్నం మీదుగానే వెళ్లాలి. ఇక్కడి విమానాశ్రయంలోనే విమానం ఎక్కాలి. ఓ అరగంట సమయం కేటాయించి ఇక్కడి సమస్యలపై దృష్టిసారించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. రద్దయిన విమానాలు వెంటనే పునరుద్ధరణ జరిగేలా, కొత్త సర్వీస్‌లు వచ్చేలా చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.
గతంలో విశాఖ నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్ ఉండేది. వాస్తవానికి ఇక్కడి నుంచి ప్రారంభమైన తొలి విదేశీ విమానం అదే. ఇండియన్ ఎయిర్‌లైన్స్ నడిపింది. కరోనా సమయంలో రద్దయిన ఆ విమానం మళ్లీ పునరుద్ధరణ జరగలేదు. విశాఖ కంటే అనేక విధాలుగా తరువాత స్థానంలో విజయవాడకు మాత్రం దుబాయ్ విమానం నడుస్తోంది. కేంద్ర మంత్రి తక్షణమే విశాఖలో ఓ సమావేశం ఏర్పాటుచేసి, విమాన సర్వీస్‌లతో పాటు కార్గో సేవలు కూడా ప్రారంభమయ్యేలా చూడాల్సి ఉంది. ఉడాన్ యాత్రీ క్యాంటీన్ రుచులను ఇక్కడి ప్రయాణికులకు పరిచయం చేసే బాధ్యత తీసుకోవాలి.
52 వాహనాలు సీజ్
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు గురువారం రాత్రి నగరంలో ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టారు. కీలకమైన 51 ప్రాంతాల్లో ఒక డీసీపీ, ఒక ఏడీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 250 మంది సిబ్బందితో కలిసి 1,908 వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లను సీజ్ చేశారు. అలాగే మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న ఏడుగురిపై కేసులు నమోదుచేశారు. ఇంకా హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్నందుకు 32 మందిపై, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఇద్దరిపై, లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ఒకరిపై కేసులు నమోదుచేశారు.
మూతపడిన ఫిట్జీ
రెండో ఏడాది ఫీజు కూడా గత ఏడాదే వసూలు చేసిన యాజమాన్యం
కళాశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
ఎంవీపీ కాలనీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఫిట్జీ జూనియర్ కళాశాల మూతపడింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కళాశాల ఎదుట నిరసనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్‌లకు విద్యార్థులను సన్నద్ధం చేస్తామంటూ భారీ ప్రకటనలతో ఫిట్జీ జూనియర్ కళాశాల దేశవ్యాప్తంగా బ్రాంచిలను ఏర్పాటుచేసింది. ఈ మేరకు నగరంలోని శాంతిపురం, ఎంవీపీ కాలనీల్లో రెండు బ్రాంచీలను తెరిచింది. ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజుగా వసూలు చేసింది. ఎంవీపీ బ్రాంచిలో గత విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సుమారు 220 మంది చేరారు. విద్యా సంవత్సరం సగం కూడా గడవకముందే రెండో ఏడాది ఫీజునూ వసూలు చేశారు. ఇదిలావుండగా అక్టోబరు నుంచే గడ్డుకాలం ప్రారంభమయింది. యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదంటూ అధ్యాపకులు ఒక్కొక్కరుగా కళాశాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పరీక్షల ముందు ఈ పరిస్థితి తలెత్తడంతో కొంతమంది తమ పిల్లలను ఇతర కళాశాలల్లో చేర్పించారు. మిగిలినవారు అక్కడే పరీక్షలు రాశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా క్లాసులు నడిచే పరిస్థితి లేకపోవడంతో తాము చెల్లించిన ఫీజు వాపసు చేయాలని తల్లిదండ్రులు కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ లేఖలు ఢిల్లీలో ఉన్న యాజమాన్యానికి పంపించడం మినహా తాము ఏమీ చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థుల జీవితంతో ఆడుకున్న ఫిట్జీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కళాశాల ఎదుట నిరసన తెలిపిన అనంతరం ఎంవీపీ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం కళాశాలలో ముగ్గురు కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు. శాంతిపురం బ్రాంచి వద్ద కూడా బోర్డు కూడా తొలగించారు.
చర్యలు తీసుకుంటాం
కళాశాల మూసివేయాల్సిన పరిస్థితి వస్తే, విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించాలి. తల్లిదండ్రులు ఒకేసారి రెండు సంవత్సరాల ఫీజు చెల్లించకూడదు. అర్ధంతరంగా మూసివేసిన ఫిట్జీ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- పి.మురళీధర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఇంటర్ బోర్డు