నూకాంబిక ఆలయం కిటకిట
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:49 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కొత్త అమావాస్య జాతర ప్రారంభమైన తరువాత అమ్మవారి దర్శనానికి అత్యధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.
అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కొత్త అమావాస్య జాతర ప్రారంభమైన తరువాత అమ్మవారి దర్శనానికి అత్యధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. అంతకుముందు ఉదయం ఆరు గంటలకు ఆలయ అర్చకులు బాలాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. అప్పటికే భక్తులు క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో వేచివున్నారు. ఆలయం లోపల, ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోయి రోడ్డుపైనా బారులు తీరారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆలయం మూసివేసే వరకు భక్తులరాక కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదినం సందర్భంగా గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి శోభారాణి, ఈవో రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
-అనకాపల్లి టౌన్/ ఆంధ్రజ్యోతి