ముత్యాలమ్మ జాతరకు ముస్తాబు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:14 AM
ముత్యాలమ్మ జాతరకు చింతపల్లి ముస్తాబవుతున్నది. ఈ నెల 24 నుంచి 27 వరకు జాతర నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతర సమీపిస్తుండడంతో కమిటీ సభ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
- చింతపల్లిలో విద్యుద్దీపాలంకరణ, భారీ హోర్డింగ్‌లు
- ఆర్టీసీ కాంప్లెక్స్ మైదానంలో ఎగ్జిబిషన్
- రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
చింతపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ముత్యాలమ్మ జాతరకు చింతపల్లి ముస్తాబవుతున్నది. ఈ నెల 24 నుంచి 27 వరకు జాతర నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతర సమీపిస్తుండడంతో కమిటీ సభ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అమ్మవారి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తుల కోసం మండపాలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి పాదాలు ప్రతిష్ఠించేందుకు గర్భిణుల వసతి గృహం ఆవరణలో సతకంపట్టు, సుర్లవారి స్థావరం వద్ద మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది విద్యుద్దీపాలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గతానికి భిన్నంగా సంతబయలు నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్, సాయిబాబా ఆలయం వరకు 2.5 కిలోమీటర్లు లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి అనుబంధంగా ఉన్న వీధులనూ విద్యుద్దీపాలతో అలంకరించారు. పాత బస్టాండ్, రంగా సెంటర్, న్యాయస్థానం వద్ద భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సబ్ జైల్, అమ్మవారి మైదానంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. పలు రకాల దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులు పారిశుధ్యం మెరుగు కోసం, రక్షిత మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, వెంకటరమణ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.