Share News

చెరువులో రోడ్డును తొలగించాల్సిందే లేదంటే చట్టప్రకారం చర్యలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:31 AM

మండలంలోని రాజన్నపేటలో నిబంధనలకు విరుద్ధంగా సాగునీటి చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేసిన నల్లరాయి క్వారీ యాజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రోడ్డును తొలగించి, చెరువు గర్భాన్ని పూర్వస్థితికి తీసుకురాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చెరువులో రోడ్డును తొలగించాల్సిందే  లేదంటే చట్టప్రకారం చర్యలు
చెరువు మధ్యలో నుంచి వేసిన రోడ్డును పరిశీలిస్తున్న తహసీల్దార్‌, ఇరిగేషన్‌ అధికారులు (ఫైల్‌ ఫొటో)

రాయి క్వారీ లీజుదారునికి అధికారులు నోటీసులు

రోలుగుంట మండలంలో రాజన్నపేటలో చెరువు గర్భం ఆక్రమణ

క్వారీ నుంచి నల్లరాయి తరలింపునకు అక్రమంగా రోడ్డు నిర్మాణం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

సర్వే చేసి.. నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్ధారణ

రోలుగుంట, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజన్నపేటలో నిబంధనలకు విరుద్ధంగా సాగునీటి చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేసిన నల్లరాయి క్వారీ యాజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. రోడ్డును తొలగించి, చెరువు గర్భాన్ని పూర్వస్థితికి తీసుకురాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మండలంలోని రాజన్నపేటలో ఏకా వీర్రాజు అనే వ్యక్తి నల్లరాయి క్వారీ నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి భారీ బండరాళ్లను రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న నేవల్‌ ప్రత్యామ్నాయ బేస్‌ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. అయితే టిప్పర్‌ లారీలు క్వారీ నుంచి ప్రధాన రహదారికి చేరుకోవడానికి సరైన రోడ్డు లేకపోవడంతో సర్వే నంబరు 57/2లో వున్న భూపతి చెరువు మధ్యలో నుంచి మెటల్‌, మట్టితో తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, పలువురు నాయకులు వచ్చి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వక పిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ నాగమ్మ, డీటీ శంకర్‌రావు, సర్వేయర్లు, మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులు ఈ నెల 11వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో నుంచి రోడ్డు నిర్మించినట్టు నిర్ధారించారు. దీనివల్ల చెరువు మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడతారని గుర్తించారు. చెరువులో నుంచి వేసిన రోడ్డును తక్షణమే తొలగించి, చెరువు గర్భాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ఇరిగేషన్‌ ఏఈ డి.సూర్యనారాయణ, క్వారీ లీజుదారుడు ఏకా వీర్రాజుకు నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2025 | 12:31 AM