ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:27 AM
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశమందిరంలో గురువారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి ఆమె సమావేశంలో పాల్గొన్నారు.
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశమందిరంలో గురువారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి ఆమె సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అట్రాసిటీ కేసుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కేసుల దర్యాప్తు పూర్తి చేసి నిర్దేశించిన సమయంలోపు చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. కమిటీ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో గౌరవంగా పోలీస్ అధికారులు మెలగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాయితీ రుణాలను సత్వరమే అందిస్తామని, వారికి మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025 జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు 25 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 23 కేసులకు గాను రూ. 34.25 లక్షలు పరిహారం అందజేశామని తెలిపారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్ణీత సమయంలో చార్జిషీటు వేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సత్యనారాయణరావు, డీఎస్పీలు విష్ణుస్వరూప్, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.