గంజాయి నిందితులపై కఠిన చర్యలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:12 AM
గంజాయి రవాణాలో పాల్గొంటున్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి వెంటనే జప్తు చేయడంతో పాటు వారిని అరెస్టు చేయాలని డీఐజీ గోపీనాథ్ జట్టీ ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో రేంజ్ పరిధిలోని ఎస్పీలతో ఆయన క్రైమ్ రివ్యూ నిర్వహించారు.
- ఆస్తులు జప్తు చేయడంతో పాటు వెంటనే అరెస్టు చేయాలి
- రేంజ్ పరిధిలోని ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో డీఐజీ గోపీనాథ్ జట్టీ
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాలో పాల్గొంటున్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి వెంటనే జప్తు చేయడంతో పాటు వారిని అరెస్టు చేయాలని డీఐజీ గోపీనాథ్ జట్టీ ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో రేంజ్ పరిధిలోని ఎస్పీలతో ఆయన క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సహకారంతో సమ్రగ సమాచారం సేకరించి నిందితులను అరెస్టు చేయాలన్నారు. గంజాయి రవాణా నియంత్రణకు చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. తప్పించుకు తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, తక్షణమే చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. గంజాయి కేసులపై జాతీయ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా రివార్డు కోసం దరఖాస్తు చేయాలని సూచించారు. పోక్సో కేసులో బాధితులకు కలెక్టర్ ద్వారా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో నిందితులపై ప్రత్యేక హిస్టరీ షీట్లు తెరవాలని, వారి భద్రత కోసం శక్తి యాప్, శక్తి బృందాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ఆత్మరక్షణ, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలన్నారు. నేరాల నిరోఽధానికి ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం అత్యవసరమన్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అన్న దానిపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ ఘటనలు జరిగినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్ 1930ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్‌బర్ధార్, వకుల్ జిందాల్, మహేశ్వర్‌రెడ్డి, మాధవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.