Share News

సూపర్‌ 50 సక్సెస్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:03 AM

పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం ఐటీడీఏ అధికారులు ‘సూపర్‌ 50’ పేరిట నిర్వహించిన ప్రత్యేక బోధన మంచి ఫలితాన్ని ఇచ్చింది.

సూపర్‌ 50 సక్సెస్‌
పాడేరు మండలం గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో బాలికలకు ప్రత్యేక బోధన చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థులు

49 మంది ప్రథమ శ్రేణి, ఒకరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత

అధికారులు, టీచర్లు, విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

పాడేరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం ఐటీడీఏ అధికారులు ‘సూపర్‌ 50’ పేరిట నిర్వహించిన ప్రత్యేక బోధన మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఏజెన్సీ 11 మండలాల్లో 117 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 30 మంది బాలురు, 20 మంది బాలికలకు మండలంలోని గుత్తులపుట్టు, దిగువమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలల్లో గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రత్యేక బోధన నిర్వహించారు. ఈ విద్యార్థులంతా తాజా ఫలితాల్లో 500 పైబడి మార్కులు సాధించారు. ప్రత్యేక బోధనను సద్వినియోగం చేసుకున్నందుకు విద్యార్థులకు, చక్కని బోధన అందించిన ఉపాధ్యాయులకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ అభినందనలు తెలిపారు.

అత్యధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులు

ప్రత్యేక బోధన ఫలితంగా మొత్తం 50 మంది విద్యార్థుల్లో 49 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు మాత్రమే ద్వితీమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే గతంలో కంటే ఈ ఏడాది అధిక మార్కులు సాధించడం విశేషం. బాలికల్లో కొంటా గంగా భవాని 577 మార్కులను సాధించి ప్రఽథమ స్థానంలో నిలవగా, దుంపా పావనికి 567, గబ్బాడ ఈశ్వరమ్మకు 566, కిల్లో అరుణకు 565, జనపరెడ్డి రేవతికి 558 మార్కులు వచ్చాయి. అలాగే బాలురుల్లో ఎస్‌.త్రినాథ్‌ 569 మార్కులు, జి.మణికంఠ 550, జి.చరణ్‌ 535 మార్కులను సాధించి ప్రఽథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే ఎస్‌.కిరణ్‌ 529, కె.చందు 528, వి.మోహనరావు 525 మార్కులను సాధించారు.

కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు 34 మంది ఎంపిక

‘సూపర్‌- 50’లో ప్రత్యేక బోధన పొందిన విద్యార్థుల్లో 34 మంది కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారిలో 19 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నారు. బాలికలు మారికవలస, విసన్నపేట కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశానికి అర్హత సాధించగా, బాలురు జోగంపేట కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు అర్హత పొందారని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు. అలాగే సూపర్‌ 50ని ప్రవేశపెట్టిన ఐటీడీఏ పూర్వపు పీవో వి.అభిషేక్‌, ప్రత్యేక బోధనను పర్యవేక్షించిన గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్‌.రజని, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - Apr 24 , 2025 | 01:03 AM