Share News

టీసీఎస్‌ ఆగమనం... ఐటీ అభివృద్ధికి సంకేతం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:55 AM

దేశంలో అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్‌కు నగరంలో ఎకరా రూ.0.99పైసలకు భూములు కేటాయించడాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్‌ సమర్థించారు.

టీసీఎస్‌ ఆగమనం... ఐటీ అభివృద్ధికి సంకేతం

  • భవిష్యత్తులో విశాఖకు మరిన్ని ఐటీ, అనుబంధ కంపెనీలు

  • ఎంపీ ఎం.శ్రీభరత్‌

  • టీసీఎస్‌ గురించి మాట్లాడే స్థాయి వైసీపీకి లేదు

  • హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోతున్నా ఆపలేకపోయారు

  • ఉత్తరాంధ్రపై ఆ పార్టీవి దొంగ ఏడ్పులని విమర్శ

  • అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్‌ పార్టీ నాయకుల తప్పుడు ప్రచారం

  • విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

దేశంలో అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్‌కు నగరంలో ఎకరా రూ.0.99పైసలకు భూములు కేటాయించడాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్‌ సమర్థించారు. గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ వచ్చిన తరువాతే అనేక ప్రముఖ కంపెనీలు వచ్చాయని పేర్కొంటూ టీసీఎస్‌ వస్తే విశాఖకు మరిన్ని ఐటీ, అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో టీసీఎస్‌ తొలి దశలో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆ తరువాత దశల వారీగా కార్యకలాపాలు విస్తరిస్తుందన్నారు. టీసీఎస్‌పై నమ్మకంతోనే ప్రభుత్వం భూములు ఇచ్చిందన్నారు. టీసీఎస్‌ రాక ఐటీ అభివృద్ధికి సిగ్నల్‌గా ఆయన అభివర్ణించారు. టీసీఎస్‌కు కారుచౌకగా భూములు ఇచ్చారని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీసీఎస్‌ గురించి మాట్లాడే స్థాయి వైసీపీకి లేదన్నారు. విశాఖను ఐటీ హబ్‌ చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయన్నారు. రుషికొండలో ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు విస్తరిస్తోందని పేర్కొన్నారు. రుషికొండ ఐటీ పార్కులో మౌలిక సదుపాయాల కల్పనలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీధి లైట్లు ఏర్పాటుచేయడం, బస్‌ సౌకర్యం కల్పించడం వంటివి చేశామన్నారు. ఐటీ కంపెనీలకు పెండింగ్‌లో పెట్టిన ఇన్సెంటివ్‌లను దశల వారీగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ దొంగ ఏడ్పులు ఏడుస్తోందని శ్రీభరత్‌ విమర్శించారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం మరిచిపోయి, ఇప్పుడు అబద్ధపు ప్రచారానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. రెండు దశాబ్దాల క్రితం విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌ఎస్‌బీసీ నగరం నుంచి తరలిపోతున్నా కనీసం వారిని పిలిచి మాట్లాడలేదన్నారు. టీసీఎస్‌కు కారుచౌకగా భూమి ఇచ్చారని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు, ఒక వ్యక్తి కోసం రూ.450 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ ఎందుకు కట్టారో చెప్పాలన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిందని శ్రీభరత్‌ పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయ్యేనాటికి విశాఖ నుంచి కనెక్టవిటీ పెంపునకు వీఎంఆర్‌డీఏ రూ.400 కోట్లతో 17 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు నిర్మించనున్నదన్నారు. విశాఖ నుంచి విమానాల రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడామని, రైల్వే జోన్‌ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. లులు కంపెనీ రూ.1800 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, దీని వల్ల విశాఖలో టూరిజం విస్తరిస్తుందన్నారు. లులూ కంపెనీ విశాఖతో పాటు విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో మాల్స్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమైన వారికి మాట్లాడే హక్కులేదన్నారు. గడచిన పది నెలల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,404 కోట్లు సాయం అందించామన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని అప్పలనాయుడు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించారన్నారు. విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:55 AM