Share News

’పేట’లో చిలకల తీర్థం సందడి

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:38 PM

ఉగాదిని పురస్కరించుకుని పాయకరావుపేటలో ఆదివారం చిలకల తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మంగవరం రోడ్డులోని పేరంటాలమ్మ గుడిలో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

’పేట’లో చిలకల తీర్థం సందడి
రద్దీగా ఉన్న మంగవరం రోడ్డు

పోటెత్తిన భక్తజనం

మంగవరం రోడ్డు, మెయిన్‌రోడ్డు కిటకిట

పాయకరావుపేట, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉగాదిని పురస్కరించుకుని పాయకరావుపేటలో ఆదివారం చిలకల తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మంగవరం రోడ్డులోని పేరంటాలమ్మ గుడిలో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం చిలకల తీర్థంలో పంచదార చిలకలు, రంగుల చేటలు కొనుగోలు చేశారు. సాయంత్రం నిర్వహించిన ఈ తీర్థానికి పాయకరావుపేట, తుని పట్టణాలతో పాటు పరిసర సుమారు 30 గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో పట్టణంలోని మంగవరం రోడ్డుతో పాటు మెయిన్‌రోడ్డులో చిత్ర మందిర్‌ థియేటర్‌ నుంచి సూర్యమహల్‌ సెంటర్‌ వరకు జనంతో నిండిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన పంచదార చిలకలు, రంగుల చేటలు, ఆట వస్తువులు, తినుబండారాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తీర్థం సందర్భంగా పట్టణంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పాయకరావుపేట, నక్కపల్లి సీఐలు జి.అప్పన్న, రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలతోపాటు సుమారు 80 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 30 , 2025 | 10:38 PM