శ్లాబు పోయి రేకులొచ్చె..
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:38 AM
సాంఘిక సంక్షేమ శాఖాధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది.

- ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు వ్యయ అంచనాల్లో అధికారుల నిర్లక్ష్యం
- ప్రతిపాదనల ఆధారంగా నిధులిచ్చిన ప్రభుత్వం
- నిధులు చాలవన్న నెపంతో భవనం శ్లాబులు పడగొట్టి రేకుల షెడ్లు ఏర్పాటు
- ఎండలకు ఎలా తట్టుకుంటారని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు
నర్సీపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
సాంఘిక సంక్షేమ శాఖాధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. ఎస్సీ వసతి గృహ భవనాల మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపిన అధికారులు తీరా నిధులు వచ్చిన తరువాత చాలవనే నెపంతో పనులను నామమాత్రంగా చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల శ్లాబులను పడగొట్టి రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
నర్సీపట్నం ఏఎస్‌డబ్ల్యూవో పరిధిలో 10 వసతి గృహాలు ఉన్నాయి. హాస్టల్ భవనాలకు సున్నాలు, కిటికీ రెక్కలు, తలుపులు, మరుగుదొడ్లు, శ్లాబ్ మరమ్మతులు, ఫ్యాన్లు, ప్లంబింగ్, ఎలక్ర్టికల్ పనులకు అధికారులు రూ.1.34 కోట్లతో అంచనాలు తయారు చేశారు. దీని కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డీఈ, ఏఈలు ఒకటికి నాలుగు సార్లు వసతి గృహాలను సందర్శించి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తీరా పనులు మొదలు పెట్టిన తరువాత మరమ్మతులకు నిధులు సరిపోవడం లేదని కారణం చూపించి నర్సీపట్నం, గొలుగొండ బాలుర వసతి గృహాల శ్లాబులను పడగొట్టి వాటి స్థానంలో రేకుల షెడ్లు వేస్తున్నారు.
విడుదలైన నిధుల వివరాలు ఇవీ..
ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.34 కోట్లు విడుదల చేసింది. ఇందులో రావికమతం బాలికల వసతి గృహానికి రూ.12.5 లక్షలు, నర్సీపట్నం ఆనంద నిలయం(బాలురు) రూ.13 లక్షలు, నర్సీపట్నం బాలుర వసతి గృహం-2కి రూ.20 లక్షలు, బాలికల హాస్టల్‌కు రూ.12 లక్షలు, కళాశాల బాలికల వసతి గృహానికి రూ.3 లక్షలు, వేములపూడి బాలుర వసతి గృహానికి రూ.13 లక్షలు, నాతవరంలో బాలుర వసతి గృహానికి రూ.16 లక్షలు, బాలికల వసతి గృహానికి రూ.16 లక్షలు, నాతవరం మండలం చమ్మచింత బాలుర వసతి గృహానికి రూ.12 లక్షలు, గొలుగొండ బాలుర వసతి గృహం మరమ్మతులకు రూ.17 లక్షలు మంజూరయ్యాయి.
రేకుల షెడ్డులో బాలుర వసతి గృహాలు
నర్సీపట్నం, గొలుగొండ బాలుర వసతి గృహాల శ్లాబ్‌ల నుంచి నీరు కారుతుందన్న కారణంతో గోడలు ఉంచేసి మొత్తం శ్లాబ్‌లు పడగొట్టేశారు. కొత్త శ్లాబ్‌లు వేస్తారని అందరూ భావించారు. అయితే కాంట్రాక్టర్ నర్సీపట్నం బాలుర వసతి గృహాల శ్లాబ్‌లను పడగొట్టేసి రేకుల షెడ్లు వేశారు. గొలుగొండ బాలుర వసతి గృహానికి రేకుల షెడ్డు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విద్యార్థులకు ఇబ్బందే..
వసతి గృహాలకు రేకుల షెడ్ల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎండలు తీవ్రంగా కాసే సమయంలో ఉక్కపోతతో అల్లాడిపోతారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరమ్మతులకు అంచనాలు తయారు చేయడంలో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. శ్లాబ్‌లు శిథిలావస్థకు చేరుకొని ఉంటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటప్పుడు కొత్త శ్లాబ్ వేయాలని అందులో పేర్కొనవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.