Share News

మార్చురీలో సమస్యల కంపు!

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:11 AM

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ విభాగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆధునీకరించేందుకు ఏళ్ల తరబడి నిధులు మంజూరు చేయకపోవడంతో పరిస్థితులు దుర్భరంగా మారాయి. మొత్తం ఆరు ఫ్రీజర్లకుగాను ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది.. మరొకటి ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మిగిలిన నాలుగు ఫ్రీజర్లు మరమ్మతులకు నోచుకోక మూలకు చేరాయి.

మార్చురీలో సమస్యల కంపు!
ఎన్టీఆర్‌ ఆస్పత్రి

ఎన్టీర్‌ ఆస్పత్రి శవాగారంలో ఆరు ఫ్రీజర్లకు ప్రస్తుతం పనిచేస్తున్నది ఒక్కటే

గుర్తుపట్టని మృతదేహాలను భద్రపరడానికి ఇక్కట్లు

సాధారణ స్థితిలో ఉంచడంతో తీవ్రదుర్వాసన

పక్కనే ఉన్న ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్న రోగులు, సిబ్బంది

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ విభాగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆధునీకరించేందుకు ఏళ్ల తరబడి నిధులు మంజూరు చేయకపోవడంతో పరిస్థితులు దుర్భరంగా మారాయి. మొత్తం ఆరు ఫ్రీజర్లకుగాను ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది.. మరొకటి ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మిగిలిన నాలుగు ఫ్రీజర్లు మరమ్మతులకు నోచుకోక మూలకు చేరాయి.

అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వివిధ ప్రాంతాల్లో ప్రమాదాల్లో చనిపోయిన, పోలీసు కేసులు నమోదైన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలిస్తుంటారు. ఇంకా గుర్తు తెలియని మృతదేహాలను ఇక్కడ మార్చురీలో కొద్దిరోజులపాటు భద్రపర్చాల్సి ఉంటుంది. కానీ ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాలను భద్రపర్చడం ఇబ్బందిగా మారుతోంది. మార్చురీ విభాగంలో ఆరు ఫ్రీజర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది. మరొకటి ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మిగిలిన నాలుగు ఫ్రీజర్లు మరమ్మతులకు గురై కొన్నేళ్లుగా మూలకు చేరాయి. మృతదేహాలను భద్రపరిచేందుకు తగినన్ని ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు మృతదేహాలను సాధారణ గదిలో వుంచాల్సి వస్తున్నది. దీంతో భరించేలేని దుర్గంధం వ్యాపిస్తున్నది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చురీకి సమీపంలోనే ఇటీవల అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. దుర్గంధంతో ముక్కు మూసుకుని భోజనం చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు.

ప్రతిపాదనల స్థాయి దాటని ఆధునికీకరణ

ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీ విభాగాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అధికారులు మార్చురీతో పాటు డయాలసిస్‌ విభాగం ఆధునికీకరణ కోసం రూ.3.8 కోట్లు, ఫ్రీజర్ల నిర్వహణ, కొత్త ఫ్రీజర్ల కొనుగోలుకు రూ.55 లక్షలతో అంచనాలు తయీరు చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా, మార్చురీ విభాగంలో దుర్భర పరిస్థితి, పనిచేయని ఫ్రీజర్ల గురించి ఎమ్మెల్యే, కలెక్టర్‌కు తెలియపరిచామని చెప్పారు. మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని, పరిపాలనపరమైన ఆమోదం లభించగానే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. మృతదేహాలను ఎక్కువ రోజులు భద్రపర్చాల్సి వస్తే విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తున్నామన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:11 AM