పెనుగాలుల బీభత్సం
ABN , Publish Date - Apr 18 , 2025 | 10:30 PM
ఏజెన్సీలో శుక్రవారం ఊహించని విధంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు
జన జీవనానికి తీవ్ర అంత రాయం
పాడేరులో నిలిచిన వాహన రాకపోకలు
పాడేరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో శుక్రవారం ఊహించని విధంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా ఉదయం పొగమంచు, మధాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురవడం సాధారణమైపోయింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రంగా ఎండకాసి, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని, చినుకులతో వర్షం ప్రారంభమై భారీ స్థాయికి చేరుకుంది. ఈక్రమంలోనే భారీ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. వర్షం కంటే ఈదురుగాలుల బీభత్సం అధికమైంది. దీంతో ఎక్కడిక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ ఏడాదిలో బీభత్సం సృష్టించిన గాలి వాన అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
జిల్లా కేంద్రంలో నిలిచిన వాహనాల రాకపోకలు
భారీ గాలీవానకు జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకలు నిలిచాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండకాసి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో శుక్రవారం ఇక్కడ సంతకు వచ్చిన జనం, వర్తకులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా.. పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లే మెయిన్‌రోడ్డులో సాయిబాబా ఆలయం సమీపంలో రోడ్డుపై చెట్టు కూలిపోయింది. ఈక్రమంలో చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో స్తంభం రోడ్డుపై కూలిపోయింది. దీంతో మెయిన్‌రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో ఐటీడీఏ పీవో బంగ్లా వద్ద, పాడేరు నుంచి అరకులోయ వెళ్లే మార్గంలో తలారిసింగి వద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో ఆయా మార్గాల్లోని వాహనాల రాకపోకలు నిలిచిపోయి జనం ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆయా చెట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారు. అలాగే వారికి స్థానికులు సహకరించారు. దీంతో రోడ్డుకడ్డంగా పడిన చెట్ల కొమ్మలను ఒక్కొక్కటి తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. పాడేరులోని సాయిబాబా ఆలయం సమీపంలో నారాయణ అనే వ్యక్తి పార్క్ చేసిన స్కూటీపై చెట్టుపడడంతో నుజ్జయిపోయింది. అలాగే జిల్లా కేంద్రంలోని పాతపాడేరు, నీలకంఠానగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షం నీరు రావడంతో జనం అవస్థలు పడ్డారు. అలాగే మండలంలో డి.గొందూరు ప్రాంతంలో పాడేరు-జి.మాడుగుల హైవేలో భారీ వృక్షం కూలిపోయింది. వాహనాల రాకపోకలు ఎటువంటి అంతరాయం కలగలేదు.
రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ
జిల్లా కేంద్రం పాడేరులోనే 33 కేవీ లైన్‌కు సంబంధించిన ఐదు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ఆ శాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. స్థానిక ఐటీడీఏ పీవో బంగ్లా వద్ద, సాయిబాబు ఆలయం సమీపంలో, తలారిసింగి వద్ద మొత్తం ఐదు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో స్తంభాలను పాతడం, తెగిన విద్యుత్ తీగలను సరి చేసి విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అవసరమైన పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు. ఏ రాత్రికైనా విద్యుత్ సరఫరా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నామని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.