గాడితప్పిన నీటి సరఫరా విభాగం
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:24 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో అంతర్భాగమైన నీటి సరఫరా, యూజీడీ అధికారులు కొంతమంది కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా అధికారులు
వారు చెప్పినట్టే టెండర్లకు నిబంధనలు తయారీ
అంచనాల తయారీలో కంప్యూటర్ ఆపరేటర్ల ఇష్టారాజ్యం
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు
మామూళ్లు అందడమే కారణమని ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో అంతర్భాగమైన నీటి సరఫరా, యూజీడీ అధికారులు కొంతమంది కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లలో కాంట్రాక్టర్లు కోరినట్టు నిబంధనలు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలో నీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్వహణ కోసం ఇంజనీరింగ్ డిపార్టుమెంటులో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. నీటి సరఫరా పైప్‌లైన్‌లు, పంప్‌హౌస్‌లతోపాటు యూజీడీ పైప్‌లైన్లు, పంప్‌హౌస్‌ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూసేందుకు సూపరింటెండెంటెంట్ ఇంజనీర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ప్రతి జోన్‌కు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు. ఎక్కడైనా పైప్‌లైన్‌లు మార్చాల్సి వస్తే వాటికి సంబంధించిన అంచనాలు తయారుచేసి, ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లతో పనులు చేయించడం, పూర్తయిన పనులకు బిల్లులు అయ్యేలా చర్యలు తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఈ విభాగం కొంతకాలంగా గాడితప్పింది. కొంతమంది అధికారులను కాంట్రాక్టర్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారి ద్వారా తమకు అనుకూలంగా విధానాలను తయారుచేయించుకుంటూ భారీగా లబ్ధి పొందుతున్నారు. యూజీడీ, నీటి సరఫరా విభాగాల్లో ఏటా నిర్వహణ పనులు జరుగుతుంటాయి. వాటికోసం అధికారులు అంచనాలను తయారుచేసి టెండర్లు పిలుస్తుంటారు. అయితే టెండర్‌కు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేసే సమయంలోనే అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు దక్కేలా నిబంధనలు పెడుతున్నారు. దీనివల్ల మిగిలిన కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి అవకాశం లేకుండా పోతోంది. తాజాగా నీటి సరఫరా విభాగంలో వార్షిక నిర్వహణ (యాన్యువల్ మెయింటెనెన్స్) కింద రూ.20 కోట్ల విలువైన పనులను చేయాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. వాటికి టెండర్లు పిలిచేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారుచేసిన అధికారులు, ఒక్కో కాంట్రాక్టర్ మూడు పనులకు మాత్రమే టెండర్ వేయాలనే నిబంధనను చేర్చారు. అలాగే జోన్-6లో నీటి సరఫరా గ్యాప్‌లు కలపడం (మూడు కిలోమీటర్లు) కోసం రూ.60 లక్షల విలువైన వర్క్‌ను మూడు నెలల్లో పూర్తిచేయాలని, దీనికోసం గతంలో ఆరు కిలోమీటర్లు ఎస్‌డీపీఈ పైప్‌లైన్ వేసిన అనుభవం ఉండాలని కండీషన్ పెట్టారు. ఇలా చేయడం వల్ల ఆ పనిని ఇంజనీర్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికే దక్కడానికి అవకాశం ఏర్పడిందని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు నీటి సరఫరా, యూజీడీ విభాగాల్లో అనేకం ఉన్నాయంటున్నారు. తమకు కావాల్సిన వారికి టెండర్ దక్కేలా చేసేందుకు అధికారులు రకరకాల నిబంధనలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
డీబీల్లో కంప్యూటర్ ఆపరేటర్ల హవా
నీటి సరఫరా, యూజీడీ ఇంజనీరింగ్ విభాగంలో మూడు డ్రాయింగ్ బ్రాంచ్(డీబీ)లు ఉన్నాయి. ఒక్కో డీబీకి ఒక్కో టెక్నికల్ పర్సన్ ఇన్‌చార్జిగా ఉంటారు. అయితే టెక్నికల్ పర్సన్‌లను ఏఈ, ఈఈ స్థాయి అధికారులు డమ్మీలుగా చేసి, డీబీలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లతో వ్యవహారాలను చక్కబెట్టేస్తుంటారు. ఏదైనా ఒక పనిచేయాలని అధికారులు లేదంటే ప్రజా ప్రతినిధులు ప్రతిపాదన పంపిస్తే, ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వివరాలను డీబీలకు అందజేస్తారు. డీబీల్లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు ఆయా పనులకు ఏ మెటీరియల్ ఎంతవాడాలి?, ఎంతమంది పనివాళ్లు అవసరం అవుతారు, ఎలాంటి యంత్రాలను వాడాల్సి ఉంటుంది, మెటీరియల్ రవాణా ఖర్చులు ఎంత అవుతుంది? మెటీరియల్ ధర మార్కెట్‌లో ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ఎంత ఉంది? వంటివన్నీ లెక్కించి పని పూర్తిచేయడానికి అయ్యే ఖర్చును అంచనా (ఎస్టిమేట్) వేస్తారు. దీనిని డీబీలు పైఅధికారులకు పంపించి పనులను మంజూరుచేయిస్తారు. ఇలాంటి సమయంలో డీబీల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొందరు అంచనాలను భారీగా పెంచేస్తూ ప్రతిపాదనలు పంపిస్తున్నారు. టెండర్ పిలిచినప్పుడు ఆ వివరాలను తమతో అవగాహన కలిగిన కాంట్రాక్టర్లకు చెప్పి భారీ లెస్‌కు బిడ్ వేసేలా సహకరిస్తున్నారు. అందువల్లే నీటి సరఫరా, యూజీడీ విభాగాలకు సంబంధించి టెండర్లు 45 శాతం వరకు లెస్‌లకు వెళుతుంటాయని చెబుతున్నారు. రూ.లక్ష విలువైన పనికి టెండర్ పిలిస్తే అందులో కాంట్రాక్టర్‌కు గరిష్ఠంగా 13 శాతం లాభం ఉండేలా ఎస్టిమేట్ తయారుచేస్తారు. 13 శాతం లాభంలో జీఎస్టీ, ఆదాయపన్ను, వృత్తిపన్ను వంటివి మినహాయిస్తే ఐదు శాతం మాత్రమే మిగులుతుంది. అలాంటిది ఏకంగా 45 శాతం వరకు లెస్‌కు వెళితే అందులో పని ఎలా పూర్తిచేస్తారు?, పన్నులు ఎలా కడతారు? అనేదానికి వారి బిడ్‌లను ఆమోదిస్తున్న అధికారులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి సరఫరా, యూజీడీ విభాగం మొత్తం కొంతమంది కాంట్రాక్టర్ల గుప్పిట్లో ఉందని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి ఆ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.