పెదబొడ్డేపల్లిలో దొంగలు హల్‌చల్
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:52 AM
మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళాలు వేసి వున్న మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొమ్మిదిన్నర తులాల బంగారం, 42 తులాల వెండి, కొంత నగదును అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒకే ప్రాంతంలో తాళాలు వేసి ఉన్న మూడు ఇళ్లల్లో చోరీలు
9.5 తులాల బంగారం, 42 తులాల వెండి అపహరణ
నర్సీపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో దొంగలు హల్‌చల్ చేశారు. తాళాలు వేసి వున్న మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొమ్మిదిన్నర తులాల బంగారం, 42 తులాల వెండి, కొంత నగదును అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
పెదబొడ్డేపల్లి థెరెసా కాలనీలో ఎం.సింహాచలం, భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. సింహాచలం ఆరోగ్యం బాగోలేక పోవడంతో శనివారం అందరూ కలిసి విశాఖలో ఆస్పత్రికి వెళ్లారు. పై అంతస్థులో అద్దెకు ఉంటున్న గ ణేశ్ బుధవారం ఉదయం సింహాచలం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి అతని కుమారుడు సత్యసారఽథికి ఫోన్ చేశారు. వారు వెంటనే ఇంటికి తిరిగి వచ్చి చూడగా పడక గదిలోని బీరువా తెరిచి దుస్తులు చెల్లాచెదురుగా పడి వున్నాయి. ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే వీధిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బత్తిన సత్యనారాయణ నివాసం వుంటున్నారు. ప్రస్తుతం రాంబిల్లి మండలంలో ఎన్‌ఏవోబీలో పనిచేస్తున్నారు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళుతుంటారు. ఆయన భార్య భవానీ శనివారం అత్త వారి ఊరైన కోటవురట్ల మండలం పందూరులో పండక్కి వెళ్లారు. బుధవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడాన్ని ఎదురింటావిడ గమనించి భవానీకి సమాచారం ఇచ్చారు. ఆమెకు దగ్గర బంధువు నాగేశ్వరరావు 100కు ఫిర్యాదు చేయగా. పోలీసులు వచ్చి విచారణ చేశారు. రెండున్నర తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు బాధితులు చెప్పారు.
పెదబొడ్డేపల్లి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న రామ్‌నగర్ కాలనీలో వైజాగ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ విభాగంలో ఎస్‌ఐ కేడర్ అధికారిగా పని చేస్తున్న అడిగర్ల శ్రీరామమూర్తి నివాసం వుంటున్నారు. అయితే ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో వుంటూ వారానికి ఒక రోజు భార్యాభర్తలు ఇక్కడకు వచ్చి ఇల్లు శుభ్రం చేసుకొని వెళుతుంటారు. ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీరామమూర్తి కుమారుడు ప్రసాద్.. ఇంట్లో దుస్తులు చెల్లాచెదురుగా ఉండడాన్ని సీసీ కెమెరాలకు అనుసంధానం చేసిన సెల్ ఫోన్ ద్వారా చూసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి 10 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ గోవిందరావు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. క్లూస్ టీమ్‌లు వేలి ముద్రలు సేకరించాయి. థెరెసా కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.