Share News

తిరుపతి, షిర్డీ రైళ్లు ఫుల్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:47 AM

వేసవి సీజన్‌లో తిరుపతి, షిర్డీ రైళ్లలో బెర్తులు లభించడం గగనంగా మారింది.

తిరుపతి, షిర్డీ రైళ్లు ఫుల్‌

  • మే నెలాఖరు వరకూ బెర్తు లభించే పరిస్థితి లేదు

  • డబుల్‌ డెక్కర్‌, తిరుపతి ప్రత్యేక రైలులో మాత్రమే ఖాళీలు

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

వేసవి సీజన్‌లో తిరుపతి, షిర్డీ రైళ్లలో బెర్తులు లభించడం గగనంగా మారింది. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయాన్ని 120 నుంచి 60 రోజులకు కుదించిన నేపథ్యంలో మరింత డిమాండ్‌ పెరిగింది. ప్రతి గురువారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా షిర్డీ వెళ్లే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503), అలాగే ప్రతి ఆదివారం విశాఖ నుంచి రాయగడ మీదుగా మన్మాడ్‌ జంక్షన్‌కు నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (22847)లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. అదేవిధంగా తిరుపతి వెళ్లేందుకు ఉన్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521), హౌరా-బెంగళూరు (12863), పూరి-తిరుపతి, బిలాస్‌పూర్‌-తిరుపతి, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22504) వంటి రోజువారీ రైళ్లతోపాటు వారాంతపు, బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉండడంతో ప్రయాణికులు ఆశించిన తేదీల్లో బెర్తులు పొందలేని పరిస్థితులు నెలకొన్నాయి.

తిరుపతికి విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్‌ రైళ్లు కేవలం రెండు (తిరుమల, డబల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌లు) మాత్రమే. మిగిలినవన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా నడిచేవి. దీంతో విశాఖ నుంచి తిరుపతి బయలుదేరే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521)కు ఏడాది పొడవునా తీవ్ర డిమాండ్‌ ఉంటోంది. డబుల్‌ డెక్కర్‌కు మొదటినుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరే సమయం (రాత్రి 11 గంటలకు), తిరుపతి చేరే సమయం (మధ్యాహ్నం 12.30 గంటలకు) అనుకూలంగా లేకపోవడం, సుమారు 14 గంటలు కూర్చొని ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులు డబుల్‌ డెక్కర్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదు.

తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు నెలాఖరు వరకు ఫుల్‌

తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. అన్ని ఏసీ క్లాసులతోపాటు స్లీపర్‌ క్లాసు కోచ్‌లకు కూడా నిరీక్షణ జాబితా ఏర్పడింది. కొన్ని తేదీల్లో ఫస్ట్‌ ఏసీ బెర్తులు అంతంతమాత్రంగా అందుబాటులో ఉన్నాయి.

భువనేశ్వర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లకు బెర్తులు ఫుల్‌

విశాఖ మీదుగా భువనేశ్వర్‌ నుంచి తిరుపతి వెళ్లే వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. ప్రతి శనివారం అందుబాటులో ఉండే భువనేశ్వర్‌-తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22879), ప్రతి ఆదివారం నడిచే భువనేశ్వర్‌-తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22871)లకు మే నెలాఖరులో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌లలో ఒకటి, అరా బెర్తులు మినహా మిగిలినవి ఫుల్‌ అయిపోయాయి.

డబుల్‌ డెక్కర్‌, తిరుపతి ప్రత్యేక రైలుకు ఖాళీలు

వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండే డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు ఖాళీఉన్నాయి. అలాగే ప్రతి సోమవారం విశాఖ నుంచి తిరుపతికి ఏప్రిల్‌ 28 వరకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలుకు (08583) బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లకు బెర్తులు ఫుల్‌

ప్రతి గురువారం విశాఖ నుంచి బయలుదేరే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503)కు మే నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. ఈ రైలు పట్టాలెక్కిన రోజు నుంచి పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కనీసం వారానికి రెండు రోజులు అందుబాటులో ఉండేలా ఫ్రీక్వెన్సీ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. అలాగే ప్రతి ఆదివారం విశాఖలో బయలుదేరి మన్మాడ్‌ మీదుగా నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (22847)లో కూడా మే నెలాఖరు వరకూ బెర్తులు నిండిపోయాయి.

Updated Date - Apr 02 , 2025 | 12:47 AM