Share News

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని మహిళ మృతి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:27 AM

రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని తుని రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ పరిధిలో ఉన్న నర్సింగబిల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందన్నారు.

రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని మహిళ మృతి

కశింకోట, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని తుని రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ పరిధిలో ఉన్న నర్సింగబిల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందన్నారు. ఆమెకు సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఆకు పచ్చని రంగు చీర, గోల్డ్‌ కలర్‌ జాకెట్టు ధరించి ఉందని చెప్పారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ఆమె వివరాలు తెలిస్తే 9490619020 నంబరును సంప్రతించాలని ఆయన కోరారు.

చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

నక్కపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడని హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రావు గురువారం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేవవరం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దమ్ము అప్పలకొండ(41) బుధవారం తాటిచెట్టు ఎక్కి కమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. అతనిని కుటుంబసభ్యులు తుని ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కాకినాడ తరలించారు. కాకినాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతిగా మద్యం సేవించి మృతి

రోలుగుంట, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): కూలి పనుల నిమిత్తం తమిళనాడు నుంచి వడ్డిప వచ్చిన ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్‌ఐ రామకృష్ణారావు అందించిన వివరాల ప్రకారం.. విల్లుపురానికి చెందిన దయానిధి, మండలంలోని వడ్డిపలో ఉన్న ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని మేనమామ అయిన రమేశ్‌ కనగరాజ్‌ (42) ఈ నెల 19న తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చాడు. తనను డ్రైవర్‌గా చేర్చుకోవాలని మేనల్లుడిని కోరాడు. అయితే నీకు ఆరోగ్యం సరిగా లేదని, డ్రైవర్‌గా పనిచేయలేవంటూ కొంత డబ్బు ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్లిపొమ్మని చెప్పాడు. రమేశ్‌ తమిళనాడు వెళ్లకుండా ఇక్కడే వుండి, నాలుగు రోజుల నుంచి మద్యం తాగుతున్నాడు. వేసవి కావడంతో డీహైడ్రేషన్‌కు గురై వడ్డిప నుంచి అర్ల వెళ్లే రహదారి పక్కన ఉన్న తోటలో నిర్జీవంగా పడివున్నాడు. గురువారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రామకృష్ణారావు అక్కడకు వెళ్లి పరిశీలించారు. దయానిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

మృతుడు ముకుందరాజుపేట వాసి

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌ గూడ్స్‌షెడ్‌ జంక్షన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నక్కపల్లి మండలం ముకుందరాజుపేటకు చెందిన వి.నాగేశ్వరరావు(40)గా గుర్తించామని పట్టణ ట్రాఫిక్‌ ఎస్‌ఐ శేఖరం తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కార్మికుడని, రోజూ ఉదయం రైలులో అనకాపల్లికి వచ్చి ఉడ్‌పేటలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి పనులకు వెళ్తుంటాడన్నారు. రోజూ మాదిరిగానే బుధవారం కూడా అనకాపల్లి వచ్చిన నాగేశ్వరరావు సాయంత్రం వ్యాన్‌ ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలకు గురై చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కుటుంబసభ్యులు గురువారం వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

కె.కోటపాడు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని చౌడువాడ శివారు మల్లంపాలెంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి. వంటాకు వెంకటరమణ (49)కు పొలంలో విద్యుత్‌ బోరు వుంది. గురువారం సాయంత్రం ఇది ఆన్‌ కాకపోవడంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ఫ్యూజు వేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. భర్త మృతిపై భార్య సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

నాతవరం, ఏప్రిల్‌ 24 (ఆంద్రజ్యోతి): సుమారు 14 సంవత్సరాల నుంచి పరారీలో ఉన్న అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ పంగన్‌ దేవన్‌ను అరెస్టు చేసినట్టు నాతవరం పోలీసులు తెలిపారు. 2011లో 450 కిలోల గంజాయితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పంగన్‌ దేవన్‌ను నాతవరం పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. కొంతకాలం తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన దేవన్‌.. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేయడంతో నాతవరం కానిస్టేబుల్‌ లోవరాజు, కృష్ణాదేవిపేట ఏఎస్‌ఐ వెంకటరావు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో పంగన్‌ దేవన్‌ను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు.

Updated Date - Apr 25 , 2025 | 12:27 AM