Share News

భళా ఈపీడీసీఎల్‌!

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:26 AM

విద్యుత్‌ పంపిణీ సంస్థే విద్యుత్‌ ఆదాపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది?...అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మార్గదర్శకంగా నిలుస్తుంది.

భళా ఈపీడీసీఎల్‌!

  • విద్యుత్‌ పొదుపునకు...స్వయం సమృద్ధికి నమూనాగా సూపర్‌ ఈసీబీసీ భవనం

  • ప్రమాణాల మేరకు అధునాతన నిర్మాణం

  • స్టార్‌ హోటల్‌కు రెండు అంతస్థులు లీజు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ పంపిణీ సంస్థే విద్యుత్‌ ఆదాపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది?...అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) అదే పనిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏలూరు వరకు విస్తరించిన ఈ సంస్థ ఉద్యోగుల శిక్షణ కోసం అధునాతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పగలు విద్యుద్దీపాల అవసరం లేకుండా, ఏసీ వినియోగానికి తక్కువ విద్యుత్‌ అయ్యేలా మొత్తంగా చూసుకుంటే 50 శాతం విద్యుత్‌ ఆదా జరిగేలా భవనం నిర్మించింది. దీనికి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిబంధనలను అనుసరించింది. వారు సూచించిన విధంగా సూపర్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ)తో భవనం నిర్మించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు గ్రాంటు వచ్చింది. ఈ నిధులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో రూ.8.5 కోట్లు వెచ్చించి మొత్తం రూ.13.5 కోట్లతో గ్రౌండ్‌+రెండు అంతస్థుల భవనాన్ని విశాఖ సాగర్‌ నగర్‌లో నిర్మించింది. దీనికి నాలుగు ప్రమాణాలు పాటించింది.

ఇవీ ప్రత్యేకతలు

- భవన నిర్మాణానికి కేవిట్‌ వాల్స్‌ నిర్మించారు. ఇందుకోసం సిమెంట్‌ ఇటుకలను పోలి ఉండే ఆటోక్లేవ్డ్‌ ఏరియేటెడ్‌ కాంక్రీట్‌ (ఏసీసీ) ఇటుకలు ఉపయోగించారు. కేవిటీ వాల్స్‌ మధ్య వేడిని నియంత్రించడానికి ఊలు, ధర్మోకోల్‌ వాడారు. దీని వల్ల బయట వేడి లోపలకు రావడం చాలా వరకు తగ్గిపోతుంది.

- పైకప్పు నుంచి వేడి కిందికి రాకుండా డబుల్‌ సీలింగ్‌ వేసి, సిల్వర్‌ ఫాయిల్‌తో పైకప్పును మూయించారు. ఇది కూడా వేడిని, విద్యుత్‌ వినియోగాన్ని తగ్గిస్తుంది.

- గోడలు, కిటికీలను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం నిర్మించారు. కిటికీలకు డబుల్‌ గ్లేజ్డ్‌ అద్దాలు వాడారు. ఇది పూర్తి వెలుతురు అందిస్తూ వేడిని నియంత్రిస్తుంది.

- అన్ని భవనాల్లో ఎన్ని ఏసీలు ఉంటే బయట వాటికి అన్ని అవుట్‌ డోర్‌ యూనిట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే ఒక్క అవుట్‌ డోర్‌ యూనిట్‌ ఏర్పాటుచేసి, దానికే అన్ని ఏసీలను అనుసంధానించారు. అంతే కాకుండా లోపల ఉన్న వారికి తగినట్టుగా ఆ గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా మార్పులు చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల భవనం వినియోగంలో 50 శాతం విద్యుత్‌ ఆదా అవుతోంది.

లీజుకు రెండు అంతస్థులు

ఎకరాన్నర విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మాత్రమే శిక్షణకు ఉపయోగించుకోవాలని, మిగిలిన పై రెండు అంతస్థులు అద్దెకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వీఎంఆర్‌డీఏ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ‘లెమన్‌ ట్రీ’ సంస్థ స్టార్‌ హోటల్‌ నిర్వహణకు ముందుకువచ్చింది. చదరపు అడుగు లెక్కన అద్దె కోట్‌ చేసింది. దాని ద్వారా మంచి ఆదాయమే వస్తుందని నిర్ణయించుకున్న అధికారులు ఆ సంస్థకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే...గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్వహణకు అయ్యే వ్యయం కూడా లీజుదారులే భరించడానికి ముందుకువచ్చారు. ఫలితంగా ఈపీడీసీఎల్‌కు నిర్వహణ వ్యయం (సిబ్బంది తప్ప) తప్పింది.

స్వయం సమృద్ధి మోడల్‌

పృథ్వీ తేజ్‌, సీఎండీ, ఈపీడీసీఎల్‌

ఈ భవనం పూర్తిగా స్వయం సమృద్ధి మోడల్‌లో నడుస్తుంది. భవనం నిర్వహణకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తిరిగి ఆదాయం రూ.కోట్లలో వస్తుంది. ఈసీబీసీలో సోలార్‌ పవర్‌ తప్పనిసరి కావడంతో 15 కేవీ సోలార్‌ ప్లాంటు పెట్టాం. ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఇది నమూనాగా నిలుస్తుంది.

Updated Date - Apr 22 , 2025 | 01:26 AM