Share News

వీగుతుందా? నెగ్గుతుందా?

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:36 AM

స్థానిక మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై వైసీపీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వీగుతుందా? నెగ్గుతుందా?

  • ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై వైసీపీ అవిశ్వాస నోటీసు

  • నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్‌

  • అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చైర్‌పర్సన్‌ వర్గీయులు తీవ్రకృషి

  • నోటీసులపై సంతకాలు చేసిన వారిలో కొంతమందితో టచ్‌లో..

  • చైర్‌పర్సన్‌ను పదవి నుంచి దించడం ఖాయమంటున్న వైసీపీ నేతలు

  • పట్టణంలో సర్వత్రా చర్చ.. ఉత్కంఠ

ఎలమంచిలి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

స్థానిక మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై వైసీపీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారిపై వైసీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు గత నెలలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై మంగళవారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరుగనున్నది. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని, రమాకుమారిని పదవి నుంచి దించేయాలని వైసీపీ నేతలు కృతనిశ్చయంతో వుండగా, ఎలాగైనా వీగిపోయేలా చేయడానికి చైర్‌పర్సన్‌ వర్గీయులు తెరవెనుక వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఎలమంచిలి మునిసిపాలిటీ పాలకవర్గం ఏర్పాటు కోసం నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకుగాను 23 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఒక వార్డులో టీడీపీ, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 5వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన పిల్లా రమాకుమారిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. కాగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజకీయ కారణాల దృష్ట్యా చైర్‌పర్సన్‌ రమాకుమారి, ఆమె సోదరుడైన విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌, తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. తమ పార్టీ తరపున గెలిచి, చైర్‌పర్సన్‌ పదివి పొందని రమాకుమారి బీజేపీలో చేరడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు, ఆమెను పదవీచ్యుతురాలిని చేయాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దించేయడానికి 19 మంది సంతకాలతో కూడిన నోటీసును గత నెల 26వ తేదీన జిల్లా అధికారులతోపాటు మునిసిపల్‌ కమిషనర్‌కు కూడా అందజేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు(కన్నబాబురాజు), ఎంపీపీ బోదెపు గోవింద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌లు బెజవాడ నాగేశ్వరావు, ఆర్రెపు నాగ త్రినాథ గుప్తా, పలువురు కౌన్సిలర్లతో కలిసి ఇక్కడ సమావేశం నిర్వహించారు. వైసీపీ అధిష్ఠానం ఆదేశానుసారం రమాకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. కౌన్సిలర్ల సంతాకాల ధ్రువీకరణ అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 22వ తేదీన (మంగళవారం) కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు కమిషనర్‌ ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే...

మునిసిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యునిగా వున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి 26 మంది సభ్యులు ఉన్నారు. చైర్‌పర్సన్‌ రమాకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది అంటే.. 17 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. ఇంతకన్నా ఒక్కరు తక్కువైనా సరే అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటే కోరం (2/3 మంది హాజరు కావాలి) వుండాలి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై 19 మంది సంతకాలు చేసినప్పటికీ వీరిలో దాదాపు సగం మంది వెనక్కు తగ్గినట్టు తెలిసింది. వీరిలో కొంతమందిని తమ వైపునకు తిప్పుకుని, అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా చేయడానికి చైర్‌పర్సన్‌ వర్గీయులు చాపకింద నీరులా చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు చెబుతున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని నోటీసు ఇచ్చిన వైస్‌చైర్మన్లు, ఇతర సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో పట్టణంలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Apr 22 , 2025 | 01:37 AM