గాలి, వాన బీభత్సం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:19 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కమ్ముకోగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు ఎండకాసింది.
- జి.మాడుగుల మండలం నుర్మతి కొత్తూరులో నేలకొరిగిన భారీ వృక్షం
- రాకపోకలకు అంతరాయం
- డుంబ్రిగుడలో వడగండ్ల వాన
- పెదబయలు, హుకుంపేటలో ధ్వంసమైన పలు ఇళ్ల పైకప్పులు
మన్యానికి వదలని వాన
ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో భారీ వర్షం
ఉదయం వేళలో మంచు, మధ్యాహ్నాం ఎండ, ఆతర్వాత వర్షం
పాడేరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు కమ్ముకోగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు ఎండకాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
అరకులోయలో 36.0 డిగ్రీలు.
అరకులోయలో మంగళవారం 36.0 డిగ్రీలు, కొయ్యూరులో 35.2, డుంబ్రిగుడలో 34.8, హుకుంపేటలో 34.6, అనంతగిరి, పెదబయలులో 34.4, ముంచంగిపుట్టులో 33.5, జి.మాడుగులలో 33.4, చింతపల్లిలో 32.4, జీకేవీధిలో 31.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మద్దిగరువు రహదారిలో నుర్మతి కొత్తూరు వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ చింత చెట్టు నేలకొరిగింది. దీంతో సుమారు గంట సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నుర్మతి పంచాయతీ దిగవాకపల్లి గ్రామానికి చెందిన తల్లె పెద్దమ్మి ఇంటి పైకప్పు ధ్వంసమైంది.
చింతపల్లిలో..
చింతపల్లి: మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. గాలి, వర్షం వల్ల జాతర కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు పడిపోయాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి గిరిజనులు ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పెదబయలులో..
పెదబయలు: మండలంలో మధ్యాహ్నం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి గోమంగి, గుల్లేలు, బొంగరం, ఇంజరి, గిన్నెలకోట పంచాయతీల పరిధిలో పలు ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఇంజరి పంచాయతీలోని గబుడుపుట్టు గ్రామంలో గెమ్మెలి తరుణ్, కాంతి అనే గిరిజనుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలోని నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మఠం పంచాయతీ కొత్తూరు గ్రామంలో చెట్లు నేలకొరిగాయి. ఆ గ్రామానికి చెందిన కోర్రా సింహాచలం అనే గిరిజనుడి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంట్లోని సామాన్లు తడిసిముద్దయ్యాయి.
జీకే వీధి మండలంలో..
సీలేరు: జీకే వీధి మండలం ధారకొండ, దుప్పులవాడ పంచాయతీల్లో మంగళవారం మధ్యాహ్నం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ధారకొండలో సచివాలయం పక్కనే ఉన్న పసుమర్తి నాగేశ్ ఇంటిపై భారీ చింతచెట్టు కూలడంతో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ధారకొండ సెంటర్‌లో విద్యుత్ స్తంభం విరిగి దుకాణంపై పడింది. దుప్పులవాడలో సచివాలయం వద్ద చెట్టు నేలకొరిగి ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. గుమ్మిరేవుల పంచాయతీ మాదిమళ్ల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.