కలెక్టర్ కావాలన్న లక్ష్యంతోనే...
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:21 AM
‘‘చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్నది నా కోరిక. రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనా నిరుత్సాహపడకుండా ప్రయత్నించాను.
రెండుసార్లు విఫలమైనా నిరుత్సాహపడలేదు...
మూడో ప్రయత్నంలో 975 ర్యాంకు వచ్చింది
మళ్లీ ప్రయత్నిస్తా
స్పష్టమైన ప్రణాళిక, అంకితభావంతో కూడిన ప్రయత్నంతో విజయం సాధ్యం
సివిల్స్‌లో 975 ర్యాంకు సాధించిన రావాడ సాయి మోహిని మానస
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
‘‘చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్నది నా కోరిక. రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనా నిరుత్సాహపడకుండా ప్రయత్నించాను. మూడోసారి మంచి ర్యాంకు వచ్చింది. కలెక్టర్ కావడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తా’’...అని పేర్కొన్నారు డాక్టర్ రావాడ సాయిమోహిని మానస. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 975వ ర్యాంకు సాధించిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
మెడిసిన్ నుంచి సివిల్స్ వైపు..
మాది శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల గ్రామం. తల్లిదండ్రులు ప్రకాశరావు, ఉషారాణి. నాన్న కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తారు. అమ్మ రాజాం ఏరియా ఆస్పత్రిలో హెడ్ నర్సు. పదో తరగతి వరకు శ్రీకాకుళం శార్వాణీ స్కూల్‌లో, ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య కాలేజీలో చదువుకున్నా. అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2021లో పూర్తిచేశాను.
రోల్ మోడల్ టీఎన్ శేషన్
మొదటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలన్నది నా కోరిక. చిన్నప్పటి నుంచి కలెక్టర్‌కు ఉండే గౌరవం, అధికారాలు గురించి పేపర్లలో చూసి తెలుసుకుంటూ ఇష్టాన్ని పెంచుకున్నాను. టీఎం శేషన్ వంటి అధికారులు నాకు రోల్ మోడల్. వారి మాదిరిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది. అయితే, వైద్య వృత్తి పట్ల ఆసక్తి ఉండడంతో ముందుగా ఎంబీబీఎస్ పూర్తిచేయాలనుకున్నా. ఒకవేళ సివిల్స్ సాధించలేకపోయినా అత్యుత్తమ ఫీల్డ్‌లో ఉండేందుకు మెడిసిన్ దోహదం చేస్తుందని భావించాను. మెడిసిన్ పూర్తయిన వెంటనే సివిల్స్ శిక్షణ ప్రారంభించాను. ఆప్షనల్‌గా మెడికల్ సైన్స్‌ను ఎంచుకున్నాను.
కుంగిపోకుండా బలంగా ప్రయత్నించా..
2021 మార్చిలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పూర్తిచేశాను. మెయిన్స్‌లో ఫెయిల్ అయ్యాను. 2023లో ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. కొంత ఆందోళన చెందాను. సాధారణంగా పోటీ పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే కుంగిపోతుంటారు. నేను కూడా రెండుసార్లు సివిల్స్‌లో ఫెయిల్ అయ్యాను. అయితే కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో మరింత బలంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నా. ఎక్కడ తప్పులు చేశానో గుర్తించి...మళ్లీ మూడోసారి ప్రయత్నించాను. ఇప్పుడు 975 ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు ఐఆర్‌ఎస్ గానీ, ఐఆర్‌ఎల్‌ఎస్ గానీ రావచ్చు. కానీ, మరోసారి ప్రయత్నిస్తాను. కలెక్టర్ కావడమే లక్ష్యం.
8-10 గంటలు ప్రిపరేషన్..
ప్రిపరేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో రోజుకు 14 గంటలపాటు చదివేదాన్ని. ఆ తరువాత ఎనిమిది నుంచి పది గంటలపాటు చదివేదాన్ని. ప్రాక్టీస్ ఎక్కువగా చేశాను. మెయిన్స్ పూర్తయిన తరువాత ఆరు నెలల కిందట మెడికల్ ఆఫీసర్‌గా చేరాను. ప్రస్తుతం చినవాల్తేరులోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో పనిచేస్తున్నాను. ఉద్యోగం చేస్తుండగానే ఇంటర్వ్యూకు హాజరై విజయం సాధించాను. చాలా ఆనందంగా ఉంది. సివిల్స్‌గానీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఒకటే సలహా...ప్రణాళికతోపాటు అంకితభావంతో కృషిచేయడం అత్యంత కీలకం.