firsta aim to controle కట్టడికి ‘మందు’ వేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:08 AM
A 'drug' should be applied to the wall ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందుల షాపుల్లో ఆపరేషన్ గరుడలో భాగంగా తాజాగా చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీలు, కాలం చెల్లిన మందులు వెలుగుచూడడం అందరినీ విస్మయపరిచింది.

కట్టడికి ‘మందు’ వేయాలి
గాడి తప్పిన మెడికల్ దుకాణాలు
పట్టు కోల్పోయిన డ్రగ్ కంట్రోల్ అధికారులు
కాలం చెల్లిన మందుల విక్రయాలు
అనుమతుల్లేని కంపెనీలవి సైతం అమ్మకం
గత ఐదేళ్లుగా కొనసాగిన నిర్లక్ష్యం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందుల షాపుల్లో ఆపరేషన్ గరుడలో భాగంగా తాజాగా చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీలు, కాలం చెల్లిన మందులు వెలుగుచూడడం అందరినీ విస్మయపరిచింది. అనుమతులు లేని కంపెనీలు తయారుచేసిన మందులను కూడా విక్రయించడం వారి డబ్బు యావను తేటతెల్లం చేసింది. గత ఏదేళ్లూ పాలించిన వైసీపీ ప్రభుత్వ వారి ఆగడాలను గుర్తించడం కాని, పరిశీలించడం కాని చేయకపోవడంతో మందుల వ్యాపారం పక్కదారి పట్టింది. ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా పరిణమించిన ఈ పరిస్థితికి తక్షణం చెక్ పడాల్సిందేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
విజయనగరం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఔషధ నియంత్రణను గత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. మెడికల్ దుకాణాలపై కనీస నిఘా పెట్టలేదు. తనిఖీలు లేవు. మందుల నాణ్యత గురించి అడిగే వారు లేరు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. దుకాణ యజమానులు నచ్చినట్టు వ్యాపారం చేసుకుపోయారు. కోట్ల రూపాయలకు పడగలెత్తారు. కొత్త ప్రభుత్వంలో కూడా ఇదే పంథాలో వెళ్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వేర్వేరు బృందాలు రంగంలోకి దిగాయి. చాలాచోట్లా శుక్రవారం తనిఖీలు చేపట్టాయి. విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా వైద్యుడు వైద్యసేవలు అందిస్తే చాలుదు.. ఆయన రాసిన మందులు కూడా మంచివై ఉండాలి. నకిలీవి అయితే..అవి వాడితే ఉన్న జబ్బులకు కొత్త జబ్బులు తోడవుతాయి. ఒక్కోసారి నిలువునా ప్రాణాలనే హరిస్తాయి. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నకిలీ మందుల కట్టడికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ ప్రభావం ముందుముందు పెను విపత్తుగా మారే ప్రమాదం ఉందని తెలుసుకున్న ఈ ప్రభుత్వం మందుల మాఫియాపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. శుక్రవారం చాలా జిల్లాల్లో ఏకకాలంలో ఔషధ నియంత్రణ, విజిలెన్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. మన జిల్లాకు సంబంధించి వివిధ చోట్ల కాలం చెల్లిన, నకిలీ మందులు వెలుగుచూశాయి.
- జిల్లా కేంద్రంలో 11 మెడికల్ షాపుల్లో మెరుపు దాడులు నిర్వహించారు. వీటిలో షాపులకు లైసెన్స్‌లు లేకపోవటం, కాలం చెల్లిన, నిషేధిత ఔషధాల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నగరంలోని అంబటిసత్రం వద్దనున్న ఓ దుకాణంలో ఫార్మా కంపెనీ అనుమతి లేకుండా మత్తును కలిగించే ఔషధాలను అక్రమంగా తెప్పించుకుని డాక్టర్ చీటి లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించారు.
నమ్మలేని నిజాలెన్నో..
జిల్లా వ్యాప్తంగా జరిగిన మందుల షాపుల తనిఖీల్లో నమ్మలేని నిజాలెన్నో వెలుగులోకి వచ్చాయి. విజయనగంలోని అంబటిసత్రం వద్దనున్న దుకాణంలో మత్తెక్కించే దగ్గు మందు విక్రయిస్తున్నట్టు తేలింది. డెహ్రాడూన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.46కు కొనుగోలు చేసిన 100 మిల్లీలీటర్ల మందు సీసాను రూ.150లకు విక్రయించారు. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. ఈ మందుకు అలవాటుపడిన వారు మళ్లీ మళ్లీ తీసుకువెళ్తున్నారని తెలిసింది. ప్రతినెలా భారీగా స్టాకు వస్తుంటుందని.. ఈ నెలకు సంబంధించి 45 సీసాలే మిగిలినట్టు తనిఖీ అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. ఆ దుకాణంలో ఉండే చాలా మందులపై తయారీ, ఎక్స్‌పైరీ డేట్ సైతం లేదు. 2019 నుంచి క్రయ విక్రయాలకు సంబంధించి రికార్డులు లేవు. అధికారులు రూ.2.11 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం పట్టణాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. అనేక అవకతవకలు బయటపడ్డాయి.
షాపుల నిర్వహణ అస్తవ్యస్తం..
జిల్లాలో వందలకొద్దీ మందుల షాపులున్నాయి. చాలా షాపుల్లో మందులపై అవగాహన లేని వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. డీ ఫార్మసీ చేసిన వారి సర్టిఫికెట్‌ను లీజుపై తీసుకుని మందుల వ్యాపారం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు నడిపే మందుల షాపుల వద్ద దందా అంతా ఇంతా కాదు. అక్కడ పనిచేసే సిబ్బందిలో ఫార్మాపై కనీసం అవగాహన లేనివారిని నియమించేస్తున్నారు. చలామణిలో లేనివి, అనుమతులు లేని కంపెనీల నుంచి మందులను తెప్పించి రోగులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా మందుల దుకాణదారులు ఆర్‌ఎంపీలతో ఎక్కువగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా సైతం ఈ మందులు భారీగా చలామణి అవుతున్నట్టు తెలుస్తోంది.
ఉన్నతాధికారులకు నివేదిక
ఉత్తరాంధ్రలో ఏకకాలంలో మందుల దుకాణాల తనిఖీ జరిగింది. ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖ సహాయాన్ని తీసుకున్నాం. జిల్లాలో నాలుగు పట్టణాల్లో దాడులు చేశాం. షాపుల నిర్వహణలో అనేక లోపాలు వెలుగుచూశాయి. నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. కాలం చెల్లినవి, నిషేధిత ఔషధాలను గుర్తించి, సీజ్ చేసి, కేసులు నమోదు చేశాం.
- బర్ల ప్రసాదరావు, ఎస్పీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్
చర్యలు తప్పవు
మందుల షాపుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశాం. విజయనగరంలో ఓ షాపులో రూ.2.11 లక్షల విలువైన మందులను సీజ్ చేశాం. షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మందుల దుకాణాలను నిరంతరం తనిఖీ చేస్తాం.
- రజిత, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, విజయనగరం