Vastu Defects? వాస్తుదోషమే అంటారా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:56 PM
Blaming It on Vastu Defects? పాలకొండలో చొటుచేసుకున్న పరిణామాలతో అధికారుల్లో భయం పట్టుకుందో, లేదంటే వాస్తు దోషమనే అపనమ్మకమో తెలియదుగాని గత రెండు రోజులుగా నగరపంచాయతీలోని భవనంలోని గదుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు.

పాలకొండ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక నగర పంచాయతీకి వాస్తుదోషమో లేక అధికారుల చేతివాటమో తెలియదుగాని పాలకొండను మాత్రం అవినీతి జాడ్యం వీడడం లేదు. 2013 నుంచి చూస్తే ఇప్పటివరకు 16 మంది కమిషనర్లు పనిచేయగా వారిలో ఆరుగురు ఏసీబీకి చిక్కారు. దీన్ని బట్టి చూస్తే నగర పంచాయతీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా పాలకొండలో చొటుచేసుకున్న పరిణామాలతో అధికారుల్లో భయం పట్టుకుందో, లేదంటే వాస్తు దోషమనే అపనమ్మకమో తెలియదుగాని గత రెండు రోజులుగా నగరపంచాయతీలోని భవనంలోని గదుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. భవనం కింది భాగం నైరుతిలో ఉన్న కమిషనర్ గది దానికి ఆనుకొని ఉన్న మేనేజర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గదుల్లో మార్పులు చేస్తున్నారు. ఆ మూడు గదులను ఒక గదిగా చేసి వరుస క్రమంలో వారి టేబుళ్లను సిద్ధం చేశారు. అక్కడే ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రహరీకి ఉత్తరం వైపున ఉన్న చిన్న గేటును వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనా కాగా మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో కొందరు ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో అప్పట్లో భవనంలో మార్పులు చేశారు. మళ్లీ ఇప్పుడు నగర పంచాయతీలోని భవనంలో చిన్నపాటి మార్పులు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై కమిషనర్ జయరాంను వివరణ కోరగా.. ఉద్యోగుల సౌలభ్యం కోసమే గదుల్లో చిన్నపాటి మార్పులు చేస్తున్నామని బదులిచ్చారు.