Share News

Cement Prices పైపైకి సిమెంటు ధర!

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:07 PM

Cement Prices on the Rise నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్‌ ధర రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజుల వ్యవధిలో 17 శాతానికి పైగా ధర పెరిగింది. ఇనుము కూడా అదే బాటలో నడుస్తోంది. దీంతో గృహ నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు.

Cement Prices  పైపైకి సిమెంటు ధర!

అదే బాటలో ఇనుము

ప్రజలపై పెనుభారం

గృహ నిర్మాణాలు, ప్రభుత్వ పనులపై ప్రభావం

కొమరాడ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్‌ ధర రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజుల వ్యవధిలో 17 శాతానికి పైగా ధర పెరిగింది. ఇనుము కూడా అదే బాటలో నడుస్తోంది. దీంతో గృహ నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. వాస్తవంగా వైసీపీ హయాంలో ఇసుక దోపిడీతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో నిర్మాణ రంగం ఊపందుకుంది. ఇంతలోనే సిమెంటు, ఇనుము వంటి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పేదల గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులపైన ఈ ప్రభావం పడే అవకాశం లేకపోలేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఇసుక ధర తగ్గి..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ధర ఆకాశాన్నంటేది. ట్రాక్టర్‌ ఇసుక రూ. 5 వేలు నుంచి రూ. 7 వేలు వరకు విక్రయించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ధర వెయ్యి నుంచి రూ. 2 వేలు మధ్యకు దిగింది. జిల్లాలో భవన నిర్మాణం, ఇతర రంగాల్లో చేపట్టే పనులకు రోజూ 3 వేల నుంచి 4 వేల సిమెంటు బస్తాలు వినియోగిస్తున్నారు. 10 రోజుల్లో సిమెంటు బస్తాకు కంపెనీల బట్టి రూ. 50 నుంచి రూ. 70 వరకు పెరగడంతో వినియోగదారులపై భారీ స్థాయిలో భారం పడింది. ఇనుము ధరలు సైతం టన్నుకు రూ. 10 వేలకు పైగా పెరిగింది. గతంలో టన్ను రూ. 54 వేలు ఉంటే, ప్రస్తుతం రూ. 64 వేలు వరకు పెరిగింది.

అభివృద్ధి పనులపై..

జిల్లాలో పల్లె పండగ పథకంలో సిమెంటు రహదారులు, కాలువల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటికి ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు ప్రకారం బస్తా సిమెంటు రూ. 270 (జీఎస్టీతో కలిపి) ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో సిమెంటు బస్తా రూ. 350కు చేరడంతో అదనంగా రూ. 80 వరకు కాంట్రాక్టర్లు భరించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిన పేదల ఇళ్లు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు సహాయం సైతం ప్రకటించింది. ఈ తరుణంలో సిమెంటు, ఐరన్‌ రేట్లు పెరగడంతో లబ్ధిదారులపై కూడా పెనుభారం పడింది. రానున్న రోజుల్లో నిర్మాణాలు మందగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సిమెంటు, ఐరన్‌ ధరలను అదుపులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:07 PM