Digging... and Shifting.. తవ్వేస్తూ.. తరలిస్తూ..!
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:02 AM
Digging... and Shifting.. ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. అక్ర మార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కోనేరు రామభద్రపురం సమీపాన నాగావళిలో తవ్వకాలు
ఉదయం పోగు చేసి.. రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా
పార్వతీపురం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. అక్ర మార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖలు మౌనం వహిస్తుండడంతో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. జిల్లాలో కొమరాడ మండలం కోనేరు రామభద్రపురం సమీపంలోని నాగావళి ప్రాంతంలో అనుమతుల్లేకుండా తవ్వకాలు జరిపి.. యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తుండడం చర్చనీయంశమవుతోంది. ఈ నెల 21 నుంచి అక్రమార్కులు తమ దందా కొనసాగిస్తున్నారు. యంత్రాల సాయంతో ముందుగా ఇసుకను తవ్వి పోగు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అయినా గనుల, రెవెన్యూశాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారని సమాచారం. వారికి నెలవారీ మామూలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చు కున్న తర్వాతే అక్రమార్కులు ఇసుక తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్టు తెలిసింది.
అప్పట్లో బహిరంగంగా... ప్రస్తుతం గుట్టుగా...
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో బహిరంగంగానే ఇసుకను అక్రమంగా తరలించేవారు. అడ్డుకున్న వారిపై తిరిగి దౌర్జన్యం చేసేవారు. అధికారులు కూడా బదిలీలకు గురికావాల్సి వచ్చేది. కోనేరు రామభద్రపురం సమీపంలోని నాగావళి ప్రాంతంలో అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. గడువు ముగిసినా కొందరు వైసీపీ నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు కొనసాగించారు. తాజాగా ఆ ప్రాంతం నుంచి గుట్టుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రైతుల్లో ఆందోళన
ఇసుక అక్రమ తరలింపుతో ఈ ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఆ ప్రాంతంలో నీటిమట్టాలు బాగా తగ్గిపోయాయి. పంటలకు సాగునీరు అందని పరిస్థితి. తాజాగా మళ్లీ అదే పరిస్థితి నెలకొనడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయితే తమ వ్యవసాయ భూములకు సాగునీరు ఏ విధంగా అందుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.
మా దృష్టికి వచ్చింది
కొమరాడ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించాం. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేస్తాం.
- శ్రీనివాస్, జిల్లా గనుల శాఖాధికారి, పార్వతీపురం మన్యం