Festively సందడిగా..
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:35 PM
Festively టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజును జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీడీపీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాడవాడలా కేకులు కట్ చేశారు.
వాడవాడలా సంబరాలు
ఉత్సాహంగా పాల్గొన్న శ్రేణులు, అభిమానులు
పార్వతీపురం/బెలగాం/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పాలకొండ/వీరఘట్టం,ఏప్రిల్20(ఆంధ్రజ్యో): టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజును జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీడీపీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాడవాడలా కేకులు కట్ చేశారు. అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది. సాలూరు పట్టణంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత ఆమె శ్రేణులతో కలిసి వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మామిడిపల్లి కూడలి వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గొప్ప దార్శనికుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో శ్రమిస్తు న్నారని, ఆయనకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీలో ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ వి గ్రహానికి ఎమ్మెల్యే విజయచంద్ర పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సర్వమత పెద్దలతో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర కేక్‌ను కట్ చేసి.. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలర్పించేందుకైనా వెనుకాడనన్నారు. టీడీపీకి ఎవరైనా ద్రోహం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలోని రోగులకు ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురంలో..
మండల కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి కేక్‌ను కట్ చేశారు. మహిళలకు చీరలు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎల్విన్‌పేట కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వినాయకుని గుడిలో చంద్రబాబు పేరిట పూజలు చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
వీరఘట్టం, పాలకొండలో..
పాలకొండ, వీరఘట్టంలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరఘట్టంలో కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం పీహెచ్‌సీలో రోగులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.