ఆ మాస్టారు కోసం!
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:13 AM
For that master! ‘మా పిల్లాడు తప్పటడుగు వేస్తే ఆ మాస్టారు సన్మార్గంలో పెడతారు... మార్కులు తక్కువ వస్తే మరింత కష్టపడాలని ప్రోత్సహిస్తారు.. తినకూడనవి తింటే ఆరోగ్యం పాడువుతుందని సూచిస్తారు.. అమ్మనాన్నలకు పేరు తేవాలని సుద్ధులు చెబుతారు.. నీతి కథలు బోధిస్తారు.. ఏ విద్యార్థి అయినా కాస్త విచారంగా కనిపిస్తే దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు అడుగుతారు.. అందుకే ఆ మాస్టారే మాకు కావాలి..’ అంటూ రాజాం పోలీస్‌స్టేషన్ రోడ్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఆ మాస్టారు కోసం!
పరితపిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
బదిలీ జరగనుండడంతో ఆందోళన
ఎంఈవో, ఎమ్మెల్యేకు విన్నపం
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లోనూ వినతిపత్రం
రాజాం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
‘మా పిల్లాడు తప్పటడుగు వేస్తే ఆ మాస్టారు సన్మార్గంలో పెడతారు... మార్కులు తక్కువ వస్తే మరింత కష్టపడాలని ప్రోత్సహిస్తారు.. తినకూడనవి తింటే ఆరోగ్యం పాడువుతుందని సూచిస్తారు.. అమ్మనాన్నలకు పేరు తేవాలని సుద్ధులు చెబుతారు.. నీతి కథలు బోధిస్తారు.. ఏ విద్యార్థి అయినా కాస్త విచారంగా కనిపిస్తే దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు అడుగుతారు.. అందుకే ఆ మాస్టారే మాకు కావాలి..’ అంటూ రాజాం పోలీస్‌స్టేషన్ రోడ్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. త్వరలో జరిగే ఉపాధ్యాయుల బదిలీల్లో పాఠశాల ఉపాధ్యాయుడు దాసరి శ్రీనివాసరావుకు బదిలీ కావొచ్చునని తెలుసుకుని వారంతా కలవరపడ్డారు. సోమవారం పాఠశాల వద్దకు చేరుకుని కొద్దిసేపు ఆందోళన చేశారు. శ్రీను మస్టారును బదిలీ చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకే విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఎమ్మెల్యేను సైతం ఆశ్రయించారు. చివరి ప్రయత్నంగా ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌గా ఉన్న శ్రీకాకుళం కలెక్టరేట్‌కు సోమవారం బయలుదేరారు. అక్కడి గ్రీవెన్స్‌లో అధికారులకు తమ డిమాండ్‌ను వివరించారు. శ్రీను మస్టారును బదిలీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
రాజాం పోలీస్‌స్టేషన్ రోడ్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ 213 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల హవా నడుస్తున్న ఈ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతుండడం గమనార్హం. ఈ ప్రత్యేకతను సాధించడంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు కృషి కూడా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ స్కూల్ విజయనగరం జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందింది. కాగా ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయుడు దాసరి శ్రీనివాసరావుకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాస్టారును ఇదే పాఠశాలలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సమావేశమై ఎంఈవో ప్రవీణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పడంతో వారు నేరుగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాజాగా శ్రీకాకుళం కలెక్టరేట్‌కు సోమవారం వెళ్లి వినతిపత్రం అందజేశారు.
పునరాలోచించాలి
శ్రీను మాస్టారు వచ్చిన నాటి నుంచి పాఠశాల రూపురేఖలు మారాయి. విద్యార్థులను సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటున్నారు. వారికి క్రమశిక్షణ అలవరిచారు. మధ్యాహ్న భోజనంతో పాటు సమయపాలన విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. అటువంటి ఉపాధ్యాయుడి బదిలీ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
- కె.లక్ష్మీ, విద్యార్థి తల్లి, రాజాం
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ విద్యాబోధన సాగుతోంది. ఎంతో మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇక్కడకు వచ్చి చేరారు. డిజిటల్ బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన సాగుతోంది. మధ్యాహ్న భోజనంతో పాటు అన్నీ పక్కాగా అమలవుతున్నాయి. వీటన్నింటిలో శ్రీను మాస్టారు కృషి ఉంది. అందుకే ఆయన బదిలీ విషయంలో మినహాయింపు ఇవ్వాలి. ఎంఈవో దృష్టికి తీసుకెళ్లాం.
కె.రాము, విద్యార్థి తండ్రి, రాజాం