Share News

happy happy ఆనందమానందమాయె

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:17 AM

happy happy ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నోటిఫికేషన్‌ విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కల నెరవేరే రోజులు వస్తున్నందుకు ఆనందపడుతున్నారు.

happy happy ఆనందమానందమాయె

ఆనందమానందమాయె

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై నిరుద్యోగుల్లో హర్షం

ఉమ్మడి జిల్లాలో భర్తీకానున్న 583 పోస్టులు

జూన్‌ 6 నుంచి నెల రోజుల పాటు పరీక్ష

విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా ఉపాధ్యాయుల నియామకం

ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు నోటిఫికేషన్‌ విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కల నెరవేరే రోజులు వస్తున్నందుకు ఆనందపడుతున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మెగా డీఎస్సీకి ఆదివారం ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా జిల్లాలో ప్రభుత్వం, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో కలిపి 373 పోస్టులు, మున్సిపల్‌ పాఠశాలల్లో 73 పోస్టులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 137 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూన్‌ 6 నుంచి నెల రోజుల పాటు పరీక్ష జరుగుతుంది. విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా ఉపాధ్యాయుల నియామకం పూర్తికానుంది.

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలతో అభ్యర్థులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. ఇన్నేళ్ల తమ ప్రయత్నానికి ఓ దారి కనిపించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా డీఎస్పీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో సాధారణ ఎన్నికల ముందు గత ఏడాది ఫిబ్రవరి 12న ప్రకటన జారీ చేసింది. ఈలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో టెట్‌ పరీక్ష వాయిదా వేశారు. జిల్లాలో 284 పోస్టుల భర్తీకి ప్రకటించిన నోటిఫికేషన్‌ కూడా నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబరు 3 నుంచి 21 వరకూ టెట్‌ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు జిల్లాలో 22,890 మంది దరఖాస్తు చేసుకోగా 20,354 మంది పరీక్ష రాశారు. 2534 మంది పరీక్ష దూరంగా ఉండిపోయారు. ఇందులో 50 శాతం మంది అభ్యర్థులు క్వాలీపై అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టెట్‌ పూర్తయ్యాక డీఎస్పీకి నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ కారణంగా జాప్యం జరిగింది. వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఫ ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు వివిధ కోచింగ్‌ సెంటర్లలో చేరి శిక్షణ తీసుకుంటున్నారు. గ్రూపులుగా ఏర్పడి చదువుకుంటున్నారు. ఇంటి వద్ద చదువుకొనేందుకు అవకాశం లేని వారు గ్రంథాలయాల బాట పడుతున్నారు. అభ్యర్థుల అర్హత వయసు 42 నుంచి 44 సంవత్సరాలకు పెంచారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌,, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 49 సంవత్సరాల వరకూ అర్హులే. కాగా కొంతమంది అభ్యర్థులు పరీక్షకు ఇచ్చిన గడువును పెంచాలని కోరుతున్నారు.

15 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ

డీఎస్సీకి అర్హులైన అభ్యర్థులు ఆదివారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20న ఆన్‌లైన్‌లో మాక్‌టెస్టు నిర్వహిస్తోంది. మే 30 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ఫైనల్‌ కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి మెరిట్‌ లిస్టు విడుదల చేస్తారు.

పరీక్ష నిర్వహణకు సమయం పెంచాలి

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ నిర్వహణకు సమయం పెంచితే బావుంటుంది. 45 రోజులు సమయం చాలదు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పునరాలోచించి నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య వ్యవధి 90 రోజులు ఉండే చూడాలి. చాలా సంవత్సరాల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడం సంతోషకరం.

ఇ.రమేష్‌, నిరుద్యోగి, విజయనగరం

------------------

Updated Date - Apr 21 , 2025 | 12:17 AM