ఇంకా ఎన్నాళ్లు?
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:09 AM
జిల్లా కేంద్రం పార్వతీపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ అత్యధిక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి.

-ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
- అద్దె కొంపల్లో నడుస్తున్న వైనం
- వసతులు లేక ఉద్యోగుల ఇబ్బందులు
పార్వతీపురం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ అత్యధిక ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. ఈ భవనాలకు వేలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా మలేరియా, పంచాయతీ, సబ్‌ట్రెజరీ, సాంఘిక సంక్షేమశాఖ తదితర కార్యాలయాలకు శాశ్వత భవనాలు కరువయ్యాయి. వాటిని ఇరుకైన గదుల్లో నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే, కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు సొంతగూడును కల్పించలేకపోయింది. ఇరుకైన గదుల్లో వాటిని ఏర్పాటు చేసింది. ఏడాదిపాటే అద్దె భవనాలు ఉంటాయని, త్వరలోనే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం ఉంటుందని అప్పట్లో కొంతమంది అధికారులు, పాలకులు గొప్పలు చెప్పారు. కానీ, నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థుల వసతిగృహాలు వలే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు లేక ఉద్యోగులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు తమ కార్యాలయాలను అన్ని మౌలిక వసతులు ఉన్న ప్రైవేటు భవనాలకు తరలిస్తున్నారు. వీటికి రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు. తాము సర్వీస్‌లో ఉంటుండగా తమ శాఖలకు సొంత భవనాలను చూస్తామా? లేదా? అన్న సందేహం ఉందని కొంతమంది ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.