Statistics? ఇలా అయితే.. గణాంకాలు ఎలా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:58 PM
If This Is the Case... What About the Statistics? జిల్లాను గణాంకాధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వివిధ శాఖల్లో కీలకంగా వ్యవహరించే ఆ పోస్టులను కొన్నాళ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో గణాంకాల లెక్కలు తప్పుతున్నాయి.

ఎనిమిది మండలాలకు వారే ఇన్‌చార్జిలు
తప్పని పనిభారం
జియ్యమ్మవలస, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాను గణాంకాధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వివిధ శాఖల్లో కీలకంగా వ్యవహరించే ఆ పోస్టులను కొన్నాళ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో గణాంకాల లెక్కలు తప్పుతున్నాయి. జిల్లాలో ఎనిమిది మండలాలకు సహాయక గణాంకాధికారులు (ఏఎస్‌వో) లేరు. దీంతో ఇన్‌చార్జ్‌లే దిక్కు.గా మారారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల గణాంకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
జిల్లాలో పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజన్లకు డీఎస్‌వోలుగా జయ ప్రకాష్, రాజులమ్మ వ్యవహరిస్తున్నారు. కాగా 15 మండలాలకు ఏడుగురు సహాయ గణాంకాధికారులే ఉన్నారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఏఎస్‌వోలు ఉన్నారు. వారిలో ఏఎస్‌వో కె.సుధీర్ భామిని, సీతంపేట మండలాలకు, జె.లక్ష్మణరావు వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, కురుపాంకు, కె.చిన్నారావు పాలకొండ, జియ్యమ్మవలసకు, ఉమామహేష్ మక్కువ, పాచిపెంటకు, తవుడు సీతానగరం, సాలూరుకు, ఉమామహేశ్వరరావు పార్వతీపురం, కొమరాడకు, విజయరావు గరుగుబిల్లి, బలిజిపేట మండలాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అదనపు పని భారంతో వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చేయాల్సిన పనులు
- తహసీల్దార్ కార్యాలయంలో ఉంటూ ఉప తహసీల్దార్ పర్యవేక్షణలో పనిచేసేవారే సహాయ గణాంకాధికారులు. వారు ఉదయం 8.30గంటలకు వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
- ప్రైమరీ (వ్యవసాయం), ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్ల నుంచి డేటాను సేకరించి మండల , జిల్లా, రాష్ట్రస్థాయిలో స్థూల ఉత్పత్తిని లెక్కించడానికి సహకస్తారు.
- జనాభా గణన, జాతీయ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌వో) అనే కేంద్ర సంస్థకు అనుబంధంగా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక గణన చేస్తుంటారు. పరిశ్రమలు, ఉద్యోగ, నిరుద్యోగుల సర్వే చేస్తారు.
- రైతులకు ఎంతో ఉపయోగకరమైన క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి పంట కోత ప్రయోగాలు చేస్తారు. గ్రామస్థాయిలో వ్యవసాయ అసిస్టెంట్ చేస్తే, మండలస్థాయిలో వ్యవసాయాధికారితో కలిసి ఈ ప్రక్రియ చేపడతారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఏ రోజు డేటా ఆ రోజు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
ఎదుర్కొంటున్న సమస్యలు
- ఏఎస్‌వోకు మరికొన్ని మండలాల బాధ్యతలను అప్పగించడం వల్ల పని ఒత్తిడి ఎక్కువవుతుంది.
- పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఎంపికై గ్రూపు-2 అధికారి హోదాలో జాయినైన వీరికి 20 ఏళ్లు సర్వీసు ఉన్నా పదోన్నతి లభించడం లేదు. మిగిలిన శాఖల్లో ఐదేళ్లు సర్వీసు పూర్తవ్వగానే పదోన్నతి లభిస్తుందని వారు వాపోతున్నారు.
- సహాయ గణాంకాధికారులు మండలం మొత్తం తిరగాల్సి ఉంటుంది. వారి కొరత వల్ల ఒక్కొక్కరు రెండు మండలాల్లో తిరిగి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో చాలావరకు గణాంకాలు గాడితప్పుతున్నాయి. పరిపాలన విభాగంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న వీరి విషయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి గ ణాంకాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో ఎనిమిది మండలాలకు ఏఎస్‌వోలు ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటం వాస్తవమే. అయితే ఈ విషయమై ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించాం.
- పి.వీర్రాజు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పార్వతీపురం మన్యం జిల్లా