Share News

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:40 PM

జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. నివాస గృహాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇలా అన్నింటిలోనూ వినియోగం పెరుగుతోంది.

 పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

- వేసవి కావడమే ప్రధాన కారణం

- ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా వాడుతున్న ప్రజలు

విజయనగరం రింగురోడ్డు ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. నివాస గృహాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇలా అన్నింటిలోనూ వినియోగం పెరుగుతోంది. సాధారణ రోజుల్లో పగలు ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉంటుంది. కానీ, వేసవి వచ్చేసరికి పగలు రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ వినియోగం ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్‌ వినియోగం రెట్టింపయ్యే అవకాశం వుంది. జిల్లాలో 22,45,103 మంది జనాభా ఉన్నారు. నివాస గృహాలకు సంబంధించి 5,94,049 విద్యుత్‌ కనెక్షన్లు, కమర్షియల్‌ విభాగంలో 63,436, చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు సంబంధించి 56,826 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 509 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ), మార్చిలో 544 మిలియన్‌ యూనిట్లు, ఈ నెలలో 16 రోజులకు గాను 521 ఎంయూ విద్యుత్‌ని వినియోగించారు. మిగతా 14 రోజులకు సంబంధించి మరో 400 మిలియన్‌ యూనిట్లు, మొత్తంగా ఏప్రిల్‌లో 900 ఎంయూ విద్యుత్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. మే నెలలో ఈ వినియోగం ఇంకా పెరగనుంది, వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో విద్యుత్‌ ఖర్చు పెరుగుతోంది.

డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా

పెరిగిన విద్యుత్‌ కనెక్షన్లు, వాటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వేసవిలో ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా విద్యుత్‌ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అనవసరంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగించవద్దు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వినియోగదారులు ఎక్కువ విద్యుత్‌ను వినియోగించకుండా చూసుకోవాలి.

-ఎం.లక్ష్మణరావు, సూపరింటెండెంట్‌ ఇంజనీరు, ఏపీఈపీడీసీఎల్‌, విజయనగరం

Updated Date - Apr 27 , 2025 | 11:41 PM