Share News

Mining Excavations? మైనింగ్‌ తవ్వకాల కోసమేనా?

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:55 PM

Is It Only for Mining Excavations? సాలూరు మండలం కొఠియా గ్రూప్‌ ఎగువశెంబి సమీపంలోని కత్తులకొండ వద్ద శుక్రవారం ఒడిశావాసులు భూమి పూజ చేశారు. ఆ గ్రామానికి చెందిన పలువురి సాగు భూముల్లో ఫెన్సింగ్‌ కోసం పోల్స్‌ సైతం పాతారు. అయితే ఇదంతా మైనింగ్‌ తవ్వకాల కోసమే అని ఎగువశెంబి గిరిజనులు భావించి భగ్గుమన్నారు.

  Mining Excavations? మైనింగ్‌ తవ్వకాల కోసమేనా?
ఒడిశావాసులు తెచ్చిన పోల్స్‌ను చూపిస్తున్న ఎగువశెంబి వాసులు

భూముల్లోకి రావొద్దని ఆ రాష్ట్ర పోలీసుల హెచ్చరిక

భగ్గుమన్న గిరిజన రైతులు

సాలూరు రూరల్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి ): సాలూరు మండలం కొఠియా గ్రూప్‌ ఎగువశెంబి సమీపంలోని కత్తులకొండ వద్ద శుక్రవారం ఒడిశావాసులు భూమి పూజ చేశారు. ఆ గ్రామానికి చెందిన పలువురి సాగు భూముల్లో ఫెన్సింగ్‌ కోసం పోల్స్‌ సైతం పాతారు. అయితే ఇదంతా మైనింగ్‌ తవ్వకాల కోసమే అని ఎగువశెంబి గిరిజనులు భావించి భగ్గుమన్నారు. దీనిపై వారు ప్రశ్నించగా.. ఈ భూముల్లోకి ఎవరూ రాకూడదని ఒడిశా పోలీసులు హెచ్చరించారు. దీంతో ఎగువశెంబి గిరిజనులు ఈసురోమంటూ వెనుదిరిగారు. అయితే పీసా చట్ట పరిధిలో ఉన్న అన్‌ సర్వేయిడ్‌ భూముల్లో ఒడిశా ప్రభుత్వమైనా మైనింగ్‌ తవ్వకాలు, ఇతర పనులకు ఎలా అనుమతి ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా దూకుడు చర్యలపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కొఠియా ప్రాంతం ఐదో షెడ్యూల్‌లో ఉందన్నారు. ఇక్కడ పీసా చట్టం అమలవు తుండగా, కొఠియా గ్రామాలపై సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఉందని, గ్రామసభ అనుమతి లేకుండా ఏ పనులకైనా ఒడిశా సర్కారు ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. గిరిజనులను అడవుల నుంచి తరిమి వేయాలని ప్రయత్నిస్తే సహించబోమన్నారు.

గతేడాది ఇలా..

గతేడాది మార్చి 30న ఒడిశా వాసులు ఈ ప్రాంతంలో రిగ్‌ బోర్‌తో నీటి కోసం తవ్వకాలు , ఇతర పనులు చేపట్టారు. మైనింగ్‌ తవ్వకాలకే పనులు చేస్తున్నారని భావించిన ఎగువశెంబి, దిగువశెంబి,ఽ దూళిభద్ర గిరిజనులు సీపీఎం, గిరిజన సంఘం నేతల ఆధ్వర్యంలో ఉద్యమించారు. తవ్వకాల కోసం తెచ్చిన యంత్రాలను అడ్డుకున్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం పనులు చేస్తున్నామని ఒడిశాకు చెందిన వారు నచ్చజెప్పినా.. దానికి గిరిజనులు ససేమిరా అన్నారు. ఆ పనులేవో కొఠియా గ్రామం సమీపంలో చేసుకొవాలన్నారు. రిగ్‌ యంత్రం, ఇతర వాటిని అక్కడ నుంచి తరిమివేశారు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ మార్చిలోనే ఆ భూముల్లో ఒడిశా వాసులు పూజ చేసి, పోల్స్‌ పాతడంతో మైనింగ్‌ తవ్వకాల కోసమేనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే తమ భూములు కోల్పోతామని, అరుదైన జంతుజాలం కనుమరుగువుతుందని వారు వాపోతున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:55 PM