విషప్రయోగమేనా?
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:11 AM
Is it poisoning? దేవుదళ హైస్కూల్ ప్రాంగణంలో పదుల సంఖ్యలో పక్షుల మృత్యువాత వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటి మాంసం కోసం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డదారిలో వేటాడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
విషప్రయోగమేనా?
పక్షులు ఎందుకు చనిపోయినట్టో!
దేవుదళ ఘటనను సీరియస్‌గా తీసుకోని అధికారులు
రేగిడి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): దేవుదళ హైస్కూల్ ప్రాంగణంలో పదుల సంఖ్యలో పక్షుల మృత్యువాత వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటి మాంసం కోసం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డదారిలో వేటాడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. విష ప్రయోగంతో పక్షులు మృత్యువాతపడ్డాయని సర్పంచ్ కుప్పిలి దుర్గమ్మ ఆరోపిస్తుండగా విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూగజీవుల మరణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పర్యావరణ సమతుల్యతతో ముడి పడి ఉన్న ఈ అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇంత కీలక ఘటన గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటివరకు పాఠశాలకు ఒక్క అధికారి రాలేదు. పైగా ఈ ఘటనను అందరూ మరిచిపోయేలా కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారి తీరు వల్ల పాఠశాల సిబ్బంది కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు. అయితే పక్షుల మృతిపై స్థానికుల్లో మాత్రం చర్చ సాగుతోంది. కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాలకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని దాబాలు, హోటళ్లలో పిట్టల మాంసం అందుబాటు ఉంటోందని, కొందరు వేటగాళ్ల ద్వారా మాంసం తెప్పించుకుంటున్నారని స్థానికంగా చెప్పుకొంటున్నారు. ఈక్రమంలోనే వేటగాళ్లు ఆ రోజు కాకులు, పావురాలకు విష ప్రయోగం చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదేరోజు స్కూల్ ప్రాంగణంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తిరిగారని, మూడు బస్తాల్లో చనిపోయిన కాకులు, పావురాలను తీసుకెళ్లారని కొందరు చెబుతున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయంటున్నారు. ఘటన జరిగిన రోజున వాటిని చూసిన కొందరు విద్యార్థులు కలవరంతో మధ్యాహ్నం భోజనం చేయలేదు.
- దేవుదళ హైస్కూల్ ప్రాంగణంలో పక్షుల మృత్యువాత ఘటనపై ఎంఈవో వరప్రసాదరావును ఆంరఽధజ్యోతి వివరణ కోరగా పిల్లలకు ఎటువంటి హాని లేకపోవటంతో విచారణ వరకు వెళ్లలేదని, ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని అన్నారు.