Share News

Is there security in those buildings? ఆ భవనాల్లో భద్రత ఉందా?

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:03 AM

ఉమ్మడి జిల్లాలో వందకుపైగా కార్పొరేట్‌, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. చాలావాటికి అనుమతుల విషయంలో అనేక అనుమానాలున్నాయి. భవన నిర్మాణాల నుంచి విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల వరకు అన్నింటా నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Is there security in those buildings? ఆ భవనాల్లో భద్రత ఉందా?

ఆ భవనాల్లో భద్రత ఉందా?

ఇరుకు గదుల్లో ఇంటర్‌ తరగతులు

మొక్కుబడిగా ఫైర్‌సేఫ్టీ పరికరాలు

కనీస నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు

అడ్డగోలుగా అనుమతులు

అధికారుల తీరుపై విమర్శలు

- జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో అనేక ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. అగ్గిపెట్టెల్లాంటి అద్దె భవనాల్లో ఇరుకు ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలకు వెళ్లే దారి కూడా ఇరుగ్గా ఉంటోంది. ఆట మైదానాలు అన్నిచోట్లా లేవు. ఉన్నా కొద్ది స్థలమే.

- విజయనగరంలోని తోటపాలెంలో ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ కూడా చాలా తక్కువ స్థలంలో ఉంది. తరగతి గదుల్లోకి గాలి కూడా రావడం కష్టమేమో అనేలా కనిపిస్తున్నాయి. కేవలం వ్యాపార ప్రయోజనాలను ఆశించి ఇక్కడ కళాశాలను నిర్వహిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయకుండా అనుమతులు ఇచ్చేశారు.

- తోటపాలెంలోని ఓ భవనానికి అనుమతి లేదని నగరపాలక సంస్థ అధికారులు కొంతమేర కూల్చేశారు. అంతలో ఏమైందోకానీ.. రెండు నెలల్లో తిరిగి ఆ భవన నిర్మాణం పూర్తి చేసి ఓ విద్యా సంస్థకు లీజుకు ఇచ్చేశారు. నిర్మాణంలో నిబంధనలు పాటించని భవనంలో ఏకంగా విద్యా సంస్థ నడుస్తోంది.

విజయనగరం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి జిల్లాలో వందకుపైగా కార్పొరేట్‌, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. చాలావాటికి అనుమతుల విషయంలో అనేక అనుమానాలున్నాయి. భవన నిర్మాణాల నుంచి విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల వరకు అన్నింటా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస నిబంధనలు పాటించకపోయినా అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా అనుమతులు ఇచ్చేశారు. ఇటీవల విద్యాసంస్థల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయినా సరే యంత్రాంగం తీరులో మార్పులు రావడం లేదు. వాస్తవానికి ప్రవేశాల సంఖ్య ఆధారంగా జూనియర్‌ కాలేజీలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో ప్రవేశాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఇదెక్కడా పాటిస్తున్న దాఖలాలు లేవు.

- ఒక గదికి 40 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. ప్రతి గదిలో వెంటిలేషన్‌ ఉండాలి. అగ్నిప్రమాదం లాంటి విపత్తుల సమయంలో క్షేమంగా బయటకు తరలించేందుకు వీలుగా కిటికీలు, ద్వారాలు ఉండాలి. కాలేజీకి వచ్చే మార్గం విశాలంగా ఉండాలి. మరో మార్గం గుండా బయటకు వెళ్లాలి. కానీ దాదాపు అన్ని కాలేజీల్లో ఇన్‌గేట్‌, అవుట్‌ గేటు ఒక్కటే ఉంటున్నాయి. అగ్నిప్రమాదం సంభవిస్తే సులువుగా బయటపడేందుకు ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. ట్యాంకర్లను అమర్చాలి. చాలా కాలేజీల్లో అవి కనిపించడం లేదు. అధిక ఫీజులు వసూలు చేస్తూ లాభాపేక్షతోనే నడిపిస్తున్నాయి. విద్యార్థుల రక్షణను గాలికొదిలేస్తున్నాయి. ఒకటి, రెండు విద్యా సంస్థలే ఫైర్‌సేఫ్టీ, ఇతర భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

తనిఖీల ఊసే లేదు

వాస్తవానికి ప్రతి జూనియర్‌ కాలేజీని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ అధికారులు తనిఖీ చేయాలి. అగ్నిమాపక సిబ్బంది కూడా తనిఖీ చేసి సంబంధిత యాజమాన్యాలకు కీలక సూచనలు ఇవ్వాలి. నిబంధనలు పాటించని వారికి నోటీసులు అందించాలి. అవసరం అనుకుంటే కేసులు కూడా నమోదుచేయాలి. విజయనగరంలో చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఇరుకు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కాలేజీల నిర్వహణకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎలా అనుమతులిచ్చారో తెలియడం లేదు. అధికారులు మామ్మూళ్ల మత్తులో పడి ఇలా ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చారన్న విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ కాలేజీలు భేష్‌

ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలతో పోల్చుకుంటే ప్రభుత్వ విద్యాసంస్థలు భవనాల పరంగా నిబంధనలు పాటిస్తున్నాయి. దాదాపు అన్ని కాలేజీలకు సొంత భవనాలు ఉన్నాయి. గ్రామాలకు, పట్టణాలకు దూరంగా సువిశాల ప్రాంగణంలో నడుస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఉత్తీర్ణతను పెంచుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 32, కేజీబీవీలు ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కళాశాలలు 71 ఉన్నాయి. ఇటీవల విడదలైన ఇంటర్‌ ఫలితాల్లో కేజీబీవీలు, మోడల్‌ కళాశాలలు మంచి ఉత్తీర్ణతను సాధించాయి.

మొక్కుబడిగా సీవోటీ సిలిండర్లు

ఆదినారాయణ, విద్యార్థి తండ్రి

జిల్లాలోని అనేక విద్యాసంస్థలు నిబంధనలకు పాతర వేశాయి. కొన్నిచోట్ల నామమాత్రంగా సీవోటీ సిలిండర్‌లు పెట్టారు. అవి కేవలం అలంకారప్రాయమే. ఫైర్‌, విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే పనిచేయవు. ఒకే మెట్ల మార్గంలో విద్యార్థులు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తొక్కిసలాటకు అవకాశం ఉండొచ్చు. కానీ ఏ సంస్థా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు.

భదత్రను పట్టించుకోకుంటే చర్యలు

జిల్లాలో ప్రతి ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో ఆగ్నిమాపక శాఖ అధికారులు ఇచ్చిన ధ్రువ పత్రాలు ఉన్నాయి. ఫైర్‌ స్టేపీ పరికరాలు కూడా ఉన్నాయి. లేకపోతే చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల చదువుకు అనువుగా తరగతి గదులు ఉండాలి.

మజ్జి ఆదినారాయణ, ఆర్‌ఐవో

--------------

Updated Date - Apr 17 , 2025 | 12:03 AM