JSL factory lockout జేఎస్‌ఎల్ కర్మాగారం లాకౌట్
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:45 PM
JSL factory lockout ఉద్యోగ భరోసాకు రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మికులు రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఏకంగా జేఎస్‌ఎల్ కర్మాగార యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ముడిసరుకు కొరత, ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఎత్తేయడంతో నడపడం కష్టమని నోటీస్‌లో పేర్కొంది. ఈ నిర్ణయంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
జేఎస్‌ఎల్ కర్మాగారం లాకౌట్
ముడిసరుకు కొరత, విద్యుత్ రాయితీలు ఎత్తేశారన్న యాజమాన్యం
లాకౌట్ వద్దంటూ కార్మికుల ఆందోళన
కొత్తవలస, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ భరోసాకు రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మికులు రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఏకంగా జేఎస్‌ఎల్ కర్మాగార యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ముడిసరుకు కొరత, ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఎత్తేయడంతో నడపడం కష్టమని నోటీస్‌లో పేర్కొంది. ఈ నిర్ణయంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో గురువారం రాత్రి సి-షిప్టు నుంచి కర్మాగారాన్ని మూసివేస్తున్నట్టు యాజమాన్య ప్రతినిధి దినేష్ శర్మ పేరుతో నోటీసును కర్మాగార గేట్‌కు అంటించారు. ముడిసరుకు కొరత, క్రోమ్ ఓర్‌కు సంబంధించిన ధరలు రెట్టింపుకావడంతో పాటు విద్యుత్ రాయితీలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో కర్మాగారం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, తప్పనిసరి పరిస్థితిలో మూసేయక తప్పడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులకు నోటీసులు పంపించింది.
గత ఏడాది నుంచీ తిరోమగమనం
గత ఏడాది మే నెలలో లాకౌట్ విధించిన యాజమాన్యం ఆగస్టులో తిరిగి లాకౌట్ ఎత్తి వేసి ఉత్పత్తి ప్రారంభించింది. సిలికాన్ మాంగనీస్ తయారు చేయడం మొదలు పెట్టింది. దీనివల్ల కర్మాగారం నుంచి విపరీతంగా కాలుష్యం వస్తోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా గత 20 రోజులుగా ఉత్పత్తి అవుతున్న సరుకు ఎగుమతి అవుతున్నప్పటికీ ముడి సరుకు రాకపోవడంతో కార్మికులలో ఆందోళన నెలకొంది. మళ్లీ లాకౌట్ చేస్తారనే అనుమానాలు రావడంతో రెండు రోజులుగా కార్మికులు తమకు ఉద్యోగ భరోసా కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్థానిక కర్మాగార యాజమాన్య ప్రతినిధులకు తెలియజేయడంతో వారు తమ మేనేజ్‌మెంట్‌తో చెప్పి విషయం తెలియజేస్తామన్నారు. ఇంతలో మేనేజ్‌మెంట్ నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదుగాని గురువారం రాత్రి సి-షిప్టునుంచి లాకౌట్ విధించారు. శుక్రవారం విధులకు వచ్చిన కార్మికులు లాకౌట్ నోటీసు చూసి వెంటనే ఆందోళనకు దిగారు. కర్మాగారానికి చెందిన వైసీపీ ట్రేడ్ యూనియన్, సీఐటీయు, టీఎన్‌టీయుసీ తదితర కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు, నాయకులు అక్రమ లాకౌట్ ఎత్తి వేయాలంటూ కర్మాగారం ఎదుట ఆందోళన చేశారు. యాజమాన్యం ముందస్తు ప్రణాళికతోనే లాకౌట్ విధించిందని ఆరోపించారు. లాకౌట్‌తో 249 మంది కాంట్రాక్టు కార్మికులు, 57 మంది ఎంప్లాయిస్ కార్మికులు వీధిన పడ్డారు. కర్మాగారం గుర్తించిన కార్మికులకు చట్ట ప్రకారం లే ఆఫ్ ఇస్తామని ప్రకటించింది.