భార్యను హతమార్చిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:09 AM
భార్యను హత్య చేసిన కేసులో జోడు నాగరాజుకు విజయనగరం జిల్లా అండ్ సెషన్స్ న్యాయాధికారి బి.కల్యాణచక్రవర్తి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.వెయి జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు.

కొత్తవలస, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): భార్యను హత్య చేసిన కేసులో జోడు నాగరాజుకు విజయనగరం జిల్లా అండ్ సెషన్స్ న్యాయాధికారి బి.కల్యాణచక్రవర్తి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.వెయి జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. ఈ కేసుకు సంబంఽధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోఇని అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడు నాగరాజు, లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారి కాపురం సక్రమంగానే సాగింది. కొడుకు పుట్టిన తర్వాత నాగరాజు వేరే యువతితో చనువుగా ఉండటంతో భార్యాభర్తల మధ్య మనస్ప ర్థలు తలెత్తాయి. దాంతో లక్ష్మి భర్తకు దూరంగా ఉంటోంది. దాంతో తనకు విడాకులు ఇవ్వాలని భార్యపై వత్తిడి తెచ్చేవాడు. దానికి అంగీకరించకపోవడంతో లక్ష్మి అడ్డు తొలగించుకుని తాను దగ్గరైన యువతిని పెళ్లి చేసుకోవాలని నాగరాజు భావించాడు. భర్తకు దూరంగా ఉంటున్న లక్ష్మి.. కొత్తవలసలోని స్వీట్‌షాపులో పని చేస్తోంది. ఈక్రమంలో 2022 జనవరి 28న సాయంత్రం స్వీట్‌షాపు నుంచి ఇంటికి వెళ్తున్న లక్ష్మి దగ్గరకు భర్త నాగరాజు వెళ్లాడు. మంచి మాటలు చెప్పి అర్ధానపాలెం-గొల్లపేటలో ఆంజనేయ తీర్థం వెళదామని చెప్పి తన స్కూటీపైౖ ఎక్కించుకుని వెళ్లాడు. భర్త మాటలు నమ్మి స్కూటీపై వెళ్లిన లక్ష్మిని అర్థానపాలెం దాటిన తరువాత నిర్మానుష్యంగా ఉన్న పెద్దగొప్పు ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో మాట్లాడుతున్నట్టు నటించి బండరాయితో తలపై మోది పక్కనే ఉన్న గోతిలో తోసేశాడు. అయితే బండరాయితో మోదినప్పటికీ ఆమె బతికే ఉందేమోనన్న అనుమానంతో మరుసటి రోజు వెళ్లి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి సీఐ బాల సూర్యారావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చివరకు నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. నాగరాజుపై రెల్లి వీఆరో జి. వెంకటరవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మూడేళ్ల విచారణ అనంతరం నాగరాజు నేరం రుజువుకావడంతో న్యాయాధికారి తీర్పు ఖరారు చేశారు.