New implications కొత్త చిక్కులు
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:26 PM
New implications రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టం(డీక్యూఎంఎస్)లో కొత్త చిక్కులు వచ్చాయి. ఈ విధానంలో స్లాట్‌బుకింగ్(అపాయింట్‌మెంట్) సదుపాయం కల్పించినప్పటికీ ఎప్పటికప్పుడు సర్వర్ ఆగిపోతోంది.
కొత్త చిక్కులు
స్లాట్ బుకింగ్‌లో మొదలైన అవస్థలు
ఆగిపోతున్న సర్వర్
పూర్తిగా అవగాహనకు రాని సిబ్బంది
క్రమ, విక్రయదారుల్లో అసహనం
రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టం(డీక్యూఎంఎస్)లో కొత్త చిక్కులు వచ్చాయి. ఈ విధానంలో స్లాట్‌బుకింగ్(అపాయింట్‌మెంట్) సదుపాయం కల్పించినప్పటికీ ఎప్పటికప్పుడు సర్వర్ ఆగిపోతోంది. దీనివల్ల అనుకున్న సంఖ్యలో రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. స్లాట్ బుకింగ్ సమయానికి కక్షిదారులు కార్యాలయంలో ఉండాలి. లేకుంటే తీవ్రమైన జాప్యం జరుగుతోంది. నూతన విధానంపై సిబ్బందిలోనూ పూర్తిస్థాయిలో అవగాహన రాలేదంటున్నారు.
గజపతినగరం, ఏప్రిల్24:(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటివరకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారు నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ స్లాట్ తీసుకుని ఆ సమయానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో క్రయవిక్రయదారులు గంటల తరబడి నిరీక్షించేవారు. అదే సమయంలో దళారులు, లేఖర్లపై ఎక్కువ మంది ఆధారపడేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్లాట్ బుకింగ్‌ను తీసుకొచ్చింది. దీనిపై సమగ్ర అవగాహన రాకపోవడంతో ఇటు సిబ్బంది, అటు క్రయవిక్రయదారుల్లో అసహనం నెలకొంటోంది. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం 2.0 విధానం తీసుకొచ్చింది. అనేక మంది ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయని భావించిన ఈ ప్రభుత్వం స్లాట్‌బుకింగ్‌ను తీసుకొచ్చింది. మొదటిదశలో జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వర్తింపజేసింది. తరువాత ఈనెల 21నుంచి మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5-30గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మెసేజ్ రూపంలో ఇచ్చే సమయాన్ని బట్టి రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. కొత్త విధానంతో క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 39 స్లాట్ బుకింగ్‌లకు రిజిస్ట్రేషన్‌లు కావాలని లక్ష్యం కాగా సర్వర్ సమస్యతో కొన్నే జరుగుతున్నాయి. సిబ్బందికే పూర్తి అవగాహన లేనప్పుడు కక్షిదారులకు ఎలా అర్థమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.