కొత్త పింఛన్లు సిద్ధం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:11 AM
కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాత దరఖాస్తులను సైతం పరిశీలించి.. జూలై నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది.
- జూలై నుంచి పంపిణీకి ప్రభుత్వం చర్యలు
- భర్త మృతి చెందిన ప్రతి భార్యకూ పింఛన్
-వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం
పార్వతీపురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాత దరఖాస్తులను సైతం పరిశీలించి.. జూలై నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా వితంతువులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా చర్యలు చేపడుతుంది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త పింఛన్లు పొందేందుకు అనేక నిబంధనలు పెట్టడంతో వితంతువులు ఇబ్బందులు పడేవారు. భర్త చనిపోయాడని ధ్రువీకరణప పత్రాలు ఇచ్చినప్పటికీ వారికి పింఛన్లు మంజూరు చేయని పరిస్థితి ఉండేది. దీంతో చాలామంది వితంతువులు పింఛన్లు పొందలేక తమ కుటుంబ సభ్యులపై ఆధారపడడం లేదా ఇతర ఉపాధి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. కుటుంబ యజమాని నెల 15వ తేదీ లోపు మరణించిన వింతతు మహిళకు తరుపరి నెల ఒకటో తేదీనే రూ.4వేల చొప్పున పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. మిగిలిన 15 రోజుల్లో మరణించిన వారికి మరుసటి నెలలో పింఛన్ జారీ చేయనున్నారు. అర్హులు ఆధార్‌కార్డు, భర్త మరణ ధ్రువపత్రం, కుల, ఆదాయం ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంది. అలాగే, వృద్ధాప్య పింఛన్ తీసుకునేవారు మరణిస్తే అతని భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి తీసుకునే వెసులుబాను కూడా కల్పించింది. ఈ మేరకు 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 లోపు సామాజిక పింఛను తీసుకుంటూ మృతి చెందిన వారి భార్యలకు పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద రిజిస్ర్టేషన్లు చేసుకొనే అవకాశం కల్పించింది. రిజిస్ర్టేషన్లు అనంతరం పూర్తిస్థాయిలో ఆయా పేర్లు పరిశీలించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయనున్నారు. జిల్లాలో 1521 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. కాగా, గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల కుటుంబ సభ్యులకే ఎక్కువగా పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్లతో దివ్యాంగ, ఆధార్ కార్డుల్లో వయసు ఎక్కువగా మార్పు చేయించి వృద్ధాప్య పింఛన్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి అనర్హులను తొలగించి.. అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది.
1521 మంది అర్హులు..
జిల్లాలోని 15 మండలాలతో పాటు రెండు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 1521 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. పాచిపెంట 88, పాలకొండరూరల్ 77, పాలకొండ అర్బన్ 47, పార్వతీపురం రూరల్ 126, పార్వతీపురం అర్బన్ 60, సాలూరు రూరల్ 75, సాలూరు అర్బన్ 70, సీతంపేట 69, సీతానగరం 117, వీరఘట్టం 127, బలిజిపేట 69, భామిని 86, గరుగుబిల్లి 77, గుమ్మలక్ష్మీపురం 63, జీఎంవలస 122, కొమరాడ 66, కురపాం 51, మక్కువ 131 మంది అర్హులు ఉన్నారు. వీరికి పింఛను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.