నేవీ ఆయుధ డిపో వద్దు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:09 AM
బ్రిటీషు కాలం నాటి బాడంగి విమానాశ్రయం(ఎయిర్ స్ట్రిప్)లో నేవీ ఆయుధ డిపోను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
బొబ్బిలి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): బ్రిటీషు కాలం నాటి బాడంగి విమానాశ్రయం(ఎయిర్ స్ట్రిప్)లో నేవీ ఆయుధ డిపోను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని, లేకుంటే ఆత్మార్పణకైనా సిద్ధమేనం టూ బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం ముందు నిరస న చేపట్టారు. ఈసందర్భంగా గ్రామ పెద్దలు ఉడమల అప్పలనాయుడు, వంగపండు రమేష్, వంగపండు జోగినాయుడు, శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ యుద్ధ సామగ్రిని నిల్వ చేసేందుకు అవసరమైన ఆయుధ డిపోను ఏర్పాటు చేసేందుకు బాడంగి ఎయిర్‌స్ట్రిప్‌ను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు యోచించడం తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఈ ఆయుధ డిపో పేరుతో పాల్తేరుతో పాటు మల్లమ్మపేట, ముగడ, పూడివలస తదితర గ్రామాలకు చెందిన పచ్చని పంట పొలాలు, పంట కాలువలన్నిటినీ హరిస్తామంటే తాము అంగీకరించేది లేదన్నారు. ఒక్క పాల్తేరు గ్రామంలోనే సుమారు 700 ఎకరాల భూమిని ఆయుధ డిపో కోసం సేకరించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారని, ఇది చాలా అన్యాయమన్నారు. తమ గ్రామాల మనుగడకు పెనుము ప్పు కలిగించే ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డోవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావుకు వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా..
పాల్తేరు రైతుల అభ్యర్థనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. బాడంగిలో సుమారు 200 ఎకరాల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ స్ట్రిప్ ఏళ్ల తరబడి వృథాగా పడి ఉంది. ఇక్కడ నేవీ ఆయుధ డిపో ఏర్పడితే ఆ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తలమానికంగా మారుతుంది. రైతులకు ఎటువంటి నష్టం లేకుండానే భూ సేకరణ జరుగుతుంది. మంచి ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తిస్తుంది.
- జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, ఆర్డీవో, బొబ్బిలి