Share News

Offer measures to players క్రీడాకారులకు కొలువుల ఆఫర్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:02 AM

Offer measures to players క్రీడాకారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో గతంలో క్రీడాకారులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను ఈ ప్రభుత్వం 3 శాతానికి పెంచింది. గతంలో ఉన్న క్రీడాపాలసీలో కొన్ని మార్పులు చేస్తూ కొత్త పాలసీని ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల విజేతలకు పోటీ పరీక్ష లేకుండానే నేరుగా ఉద్యోగాలిచ్చే విధంగా పాలసీని రూపొందించింది. దీనిపై క్రీడాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Offer measures to players క్రీడాకారులకు కొలువుల ఆఫర్‌
వెయిట్‌ లిఫ్టింగ్‌ సాధన చేస్తున్న క్రీడాకారులు

క్రీడాకారులకు కొలువుల ఆఫర్‌

ఉద్యోగ నియామకాల్లో మూడు శాతం రిజర్వేషన్‌ వర్తింపు

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలకు నేరుగా ఉద్యోగాలు

కొత్త క్రీడా పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

క్రీడాకారుల్లో హర్షం

క్రీడాకారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో గతంలో క్రీడాకారులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను ఈ ప్రభుత్వం 3 శాతానికి పెంచింది. గతంలో ఉన్న క్రీడాపాలసీలో కొన్ని మార్పులు చేస్తూ కొత్త పాలసీని ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల విజేతలకు పోటీ పరీక్ష లేకుండానే నేరుగా ఉద్యోగాలిచ్చే విధంగా పాలసీని రూపొందించింది. దీనిపై క్రీడాకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి):

అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్‌, ఎక్సైజ్‌, అటవీ వంటి శాఖల్లోనూ క్రీడాకారులకు తాజాగా పెంచిన రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయ నియామకాల్లోనూ ఈ రిజర్వేషన్‌ అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అమలులో ఉన్న క్రీడా విధానంలో కేవలం 29 క్రీడలు మాత్రమే ఉండేవి. వాటిని 65 క్రీడలకు విస్తరింపజేశారు. క్రీడాకారులు సాధించిన పతకానికి ఉద్యోగ రిజర్వేషన్‌లో పదేళ్ల వరకే కాలపరిమితి ఉంటుందన్న నిబంధనను తొలగించారు. వయసు, విద్యార్హతలు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్‌ ప్రకటించినా పతకాలు సాధించిన వారందరికీ అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

వారికి పరీక్ష లేకుండానే...

ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన వారికి గ్రూప్‌-1 ఉద్యోగాలు, కాంస్య పతకం సాధించిన వారికి గ్రూప్‌-2 ఉద్యోగాలు నేరుగా ఇస్తారు. వారు ఎలాంటి పోటీ పరీక్ష రాయనవసరం లేదు. ఏషియన్‌ పారా గేమ్స్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన వారికి గ్రూప్‌-2 ఉద్యోగాలు, రజత పతకం సాధించిన వారితో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి గ్రూప్‌-3 ఉద్యోగాలు ఇస్తారు. నాలుగేళ్ల లోపు జరిగే వరల్డ్‌ కప్‌, వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే వారికి గ్రూప్‌-3 ఉద్యోగాలు, నాలుగేళ్ల కోసారి జరిగే ఏషియన్‌ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి గ్రూప్‌-3 ఉద్యోగాలు లభించనున్నాయి. వీరితో పాటు రెండేళ్లకోసారి జరిగే జాతీయ క్రీడల్లో స్వర్ణ,రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా గ్రూప్‌-3 ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

జిల్లా క్రీడాకారుల్లో హర్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త క్రీడా పాలసీతో జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడారంగంలో రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ జిల్లా క్రీడాకారులు పలు క్రీడల్లో రాణించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ప్రఽధానంగా జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులతో పాటు రెజ్లింగ్‌ (కుస్తీ), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడ క్రీడాకారులు గత పదిహేనేళ్ల కాలంలో అంతర్జాతీయ, కామన్‌వెల్త్‌ దేశాల వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రాణించి పతకాలు సాధించారు. కుస్తీ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండగుంపాం, సారిపల్లి గ్రామాల క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. వాలీబాల్‌లో విజయనగరం, శృంగవరపుకోట, బలిజిపేట, భోగాపురం క్రీడాకారులు రాణిస్తున్నారు. గుర్ల మండలం ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కబడ్డీ, ఖోఖోల్లో నెల్లిమర్ల, సారిపల్లి, కుమిలి, జామి, చీపురుపల్లి క్రీడాకారులు రాణిస్తున్నారు. షటిల్‌బ్యాడ్మింటన్‌లో విజయనగరంతో పాటు శృంగవరపుకోట క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు.

క్రీడారంగానికి ప్రోత్సాహం

బొమ్మన రామారావు, రిటైర్డు ఫిజికల్‌ డైరెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నూతన క్రీడా పాలసీ క్రీడారంగానికి శుభపరిణామం. ఈ పాలసీ నేపధ్యంలో గ్రామ, పాఠశాల స్థాయిలో ఇక నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతిభ గల క్రీడాకారులకు నేరుగా ఉద్యోగాలు కల్పించడం క్రీడాకారులను ఉత్తేజ పరుస్తుంది.

ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం

చల్లా రాము, వెయిట్‌లిఫ్టింగ్‌ కోచ్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడా రిజర్వేషన్‌ను 2 నుంచి 3 శాతానికి పెంచడం ఆనందదాయకం. క్రీడాకారులు ఇక నుంచి పట్టుదలతో పతకాలు సాధించేందుకు కృషి చేస్తారు. రాష్ట్రంలో క్రీడారంగానికి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి.

ఉద్యోగావకాశాలు పెరిగాయి

శనపతి పల్లవి, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి

ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం నుంచి 3 శాతానికి రిజర్వేషన్‌ను ప్రభుత్వం పెంచడం శుభపరిణామం. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలను పెంచినట్లే. క్రీడారంగాన్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు క్రీడాకారులం రుణ పడి ఉంటాం.

Updated Date - Apr 23 , 2025 | 12:03 AM