It Will Be Lush and Green పనులు పూర్తయితే సస్యశ్యామలమే..
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:31 PM
Once the Works are Completed, It Will Be Lush and Green. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల గడువు పూర్తయింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాదీ సాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవని వారు దిగులు చెందుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
జైకా నిధులున్నా.. బిల్లులు మంజూరు చేయని వైనం
గత ఐదేళ్లూ నత్తనడకనే సాగిన నిర్మాణాలు
రైతులకు తప్పని సాగునీటి ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం/జియ్యమ్మవలస, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల గడువు పూర్తయింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాదీ సాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవని వారు దిగులు చెందుతున్నారు. వాస్తవంగా ‘మన్యం’లో సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో ప్రధాన స్పిల్‌వే కుడి, ఎడమ ప్రధాన కాలువలు పాడైపోయాయి. దీంతో శివారు భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న గత టీడీపీ ప్రభుత్వం 2019కు ముందు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా)తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ప్రాజెక్టుల ఆధునీకరణకు జైకా అంగీ కరించింది. కానీ 2019 తరువాత వచ్చిన వైసీపీ సర్కారు అలసత్వం కారణంగా జైకా నిధులు మంజూరైనా సకాలంలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించలేకపోయింది. సక్రమంగా బిల్లులు చెల్లించకపో వడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఈ ఏడాది మార్చితో పనుల గడువు కూడా పూర్తయింది. దీంతో రైతులు తీవ్రంగా మథనపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో వేల ఎకరాలకు సాగునీరందించే వట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ రిజర్వాయర్లతో పాటు పెదంకలాం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాలని 2016-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ బృందం ఈ ప్రాజెక్టులను పూర్తి పరిశీలన చేసి నివేదికలు అందించాయి. నాటి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలతో 2018లో జపాన్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ బృందం మరోసారి ప్రాజెక్టుల పరిశీలన చేసింది. దీని ఆధారంగా వాటి ఆధునికీకరణ కోసం నిధులు అందించడానికి జైకా అంగీకరించింది. నిధులు మంజూరైనా గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పనులు మాత్రం నత్తనడకన జరిగాయి. మరోవైపు జంఝావతి ప్రాజెక్టును గత పాలకులు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. దీంతో బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాల్లో భూములకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుత వేసవికాలంలో ఈ పనులు చేపడితే ఖరీఫ్‌లో ఆయకట్టు రైతులకు సాగునీరు ఇబ్బందులు తప్పుతాయని చెప్పొచ్చు.
ఒట్టిగెడ్డ
ఈ ప్రాజెక్టు జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ గ్రామం వద్ద ఉంది. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 16,680 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంతో దీనిని నిర్మించారు. కానీ శివారు భూములకు సాగునీరందడం లేదు. 2019, ఫిబ్రవరి 8న రూ. 44.85 కోట్లతో ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు పరిపాలన ఆమోదం , 2020, ఆగస్టు 19న సాంకేతిక అనుమతి కూడా లభించింది. దీంతో విజయవాడకు చెందిన శ్రీసాయిలక్ష్మీ కనస్ట్రక్షన్స్‌తో 2021 జనవరి 8న నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటివరకు కేవలం 15 శాతం పనులే జరిగాయి. వాస్తవానికి ఈ ఆధునికీకరణ పనులు 2024, జూలై 7 నాటికి పూర్తి కావల్సి ఉంది. రూ.3.9 కోట్లు పనులు పూర్తయినా.. బిల్లులు చెల్లించలేదు.
వెంగళరాయసాగర్
ఈ ప్రాజెక్టు సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నదిపై ఉంది. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా మూడు మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. వీఆర్‌ఎస్ ద్వారా మక్కువ మండలంలో 14,550 ఎకరాలు, బొబ్బిలి మండలంలో 6,407 ఎకరాలు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కానీ కాలువల లైనింగ్ పాడవడంతో శివారు భూములకు సాగునీరండం లేదు. దీంతో రూ. 63.50 కోట్లతో ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు 2019, ఫిబ్రవరి 15న పరిపాలన ఆమోదం, 2020 జూలై 11న సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పనులకు గాను తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలో ఉన్న ఎం/ఎస్ ఎస్‌కేఆర్ కనస్ట్రక్షన్స్, ఎం/ఎస్ రాజ్‌పద్మ ఇన్ కార్పొరేషన్లతో 2020, ఏప్రిల్ 26న రూ. 48.90 కోట్లతో నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇప్పందం కుదుర్చుకున్నారు. తొలుత పనుల పూర్తికి 2023, ఏప్రిల్ 25 నాటికి గడువు విధించారు. కేవలం 21 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించిన గడువు కూడా పూర్తయిపోయింది.
- వీఆర్‌ఎస్ ప్రాజెక్టు వద్ద స్ట్రక్చర్లు పునర్నిర్మాణం, లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అదే విధంగా కొత్త స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. శంబర వద్ద ఉన్న గోముఖి ఆక్వాడెక్ట్ 2010లో కూలిపోయింది. దీని నిర్మాణానికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతవరకు పనులు చేపట్టారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్.పెద్దవలస, మార్కొండపుట్టి తదితర గ్రామాల్లో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. రూ.10 కోట్ల వరకు ఆధునికీకరణ పనులు పూర్తి చేసినా.. గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. దీనితో పనులు నిలిచిపోయాయి.
పెద్దగెడ్డ
ఈ ప్రాజెక్టు పాచిపెంట మండలంలో ఉంది. మూడు మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరందించేలా దీనిని డిజైన్ చేశారు. పెద్దగెడ్డ పరిధిలో పాచిపెంట మండలంలో 6,039 ఎకరాలు, సాలూరు మండలంలో 2,839 ఎకరాలు, రామభద్రపురం మండలంలో 3,122 ఎకరాలు ఉన్నాయి. దీని ఆధునికీకరణ పనులకు 2019, ఫిబ్రవరి 15లో రూ. 28.18 కోట్లతో పరిపాలన ఆమోదం, 2020, మే 22న సాంకేతిక అనుమతులు లభించాయి. రూ. 23.83 కోట్లతో హైదరాబాద్ తార్నాకకు చెందిన ఎం/ఎస్ జీవీవీ - వైఎంఎంఆర్ (జేవీ)తో ఆధునికీకరణ చేసేందుకు గాను 2020 జూలై 5న ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు తుది గడువు 2023 డిసెంబరు 31 గా నిర్ణయించారు. అయితే వాస్తవానికి 18 నెలల్లో ఈ పనులు పూర్తికావాలి. కానీ నిర్ణీత గడువుకు 20 శాతమే జరిగాయి. సుమారు 4.8 కోట్ల మేర పనులు పూర్తయినా బిల్లులు మంజూరు కాలేదు.
తోటపల్లి ప్రాజెక్టు..
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలు కలుపుకుని మొత్తంగా 1,95,221 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. కానీ 1,31,221 ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం సాగునీరు అందిస్తున్నారు. ఇందులో మన్యం జిల్లాలో 13,683 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మిగిలిన భూములకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 11 స్ట్రక్చర్స్, 239 డిస్ర్టిబ్యూటర్స్, ఎర్త్ వర్క్ , కాంక్రీట్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది.
పెదంకలాం ఆనకట్ట
ఈ ఆనకట్ట సీతానగరం మండలం పెదంకలాం గ్రామం వద్ద ఉంది. బలిజిపేట మండలంలో 6,617.16 ఎకరాలకు, విజయనగరం జిల్లా వంగర మండలంలో 1,636.31 ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఆనకట్ట ఆధునికీకరణకు 2019, ఫిబ్రవరి 15న రూ. 17.30 కోట్లతో పరిపాలన ఆమోదం, 2020, జూన్ 22న సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పనులు చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్రం సూర్యపేటలో ఎం/ఎస్ ఎస్‌కేఆర్ కనస్ట్రక్షన్, ఎం/ఎస్ రాజ్‌వర్మ ఇన్ కార్పొరేషన్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. 2023 , డిసెంబరు 31 నాటికి పనులు పూర్తి చేయాలని వారితో నీటి పారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ గడువు నాటికి కేవలం ఐదు శాతం పనులే జరిగాయి. రూ.65 లక్షల పనులైనా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు.
సాగునీటికి ఇబ్బందులు
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జంఝావతి హైలెవెల్ పనులు పూర్తి కాలేదు. సాగునీటికి కటకటలాడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.
- అప్పలనాయుడు, రైతు, చిన్నబొండపల్లి, పార్వతీపురం మండలం
=================================================
పూర్తి చేయాలి
పెదంకలాం ఆయకట్టు ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో వ్యవసాయ భూములకు సాగునీరండం లేదు. ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తక్షణమే పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలి.
- సత్యంనాయుడు, రైతు, బలిజిపేట
=================================================
ఆదేశాలు రాలేదు
జైకా నిధులతో చేయాల్సిన ఆధునికీకరణ పనులకు గడువు ముగియడం వాస్తవమే. అయితే తదుపరి ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు. మరో ఏడాదికి గడువు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నాం.
- ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటి పారుదలశాఖ, పార్వతీపురం మన్యం