Share News

Responsible for the Ponds పంచాయతీ అధికారులదే చెరువుల బాధ్యత

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:40 PM

Panchayat Officials Are Responsible for the Ponds : పల్లెల్లో చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత పంచాయతీ అధికారులదేనని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. రెవెన్యూ, సర్వే, పోలీస్‌ అధికారుల సమన్వయంతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

  Responsible for the Ponds  పంచాయతీ అధికారులదే చెరువుల బాధ్యత
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత పంచాయతీ అధికారులదేనని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. రెవెన్యూ, సర్వే, పోలీస్‌ అధికారుల సమన్వయంతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పింఛన్లు, ఇతర పథకాల కోసం గ్రామ సచివాలయంలో అర్జీలు ఇచ్చే వారి అర్హతలను క్షుణ్నంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. దీనిపై మండల ప్రత్యేకాధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సూచించారు. సమస్యలు ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రగతి కనబర్చాలన్నారు. కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు వచ్చిన వినతులను సొంత సమస్యగా భావించి 48 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిచిన పీజీఆర్‌ఎస్‌కు 147 మంది అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బాల్య వివాహాల అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Updated Date - Apr 21 , 2025 | 11:40 PM