Share News

ముందే వచ్చిన పుస్తకాలు

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:39 PM

జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటికే 3,21,757 పుస్తకాలు చేరాయి. పాఠశాలల పునఃప్రారంభం కాకముందే పాఠశాలలకు పుస్తకాలను చేరవేయాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

    ముందే వచ్చిన పుస్తకాలు
జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలును పరిశీలిస్తున్న సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు

- జిల్లాకు చేరిన 3,21,757 పాఠ్య, నోట్‌ బుక్‌లు

- మండలాలకు పంపిణీ

- మిగిలినవి త్వరలో రాక

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటికే 3,21,757 పుస్తకాలు చేరాయి. పాఠశాలల పునఃప్రారంభం కాకముందే పాఠశాలలకు పుస్తకాలను చేరవేయాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గత ఐదేళ్లు గాడి తప్పిన విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులుకు గత ప్రభుత్వ హయాంలో ఉన్న యాప్‌లు భారాన్ని తగ్గించింది. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించడం కోసం కార్యచరణ తయారు చేసింది. వేసవి సెలవుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అలాగే విద్యార్థులకు అందజేసే మధ్యాహ్నం భోజనం పథకం మెనూలో కూడా మార్పులు తీసుకుని వచ్చింది. గతంలో పాఠ్య, నోట్‌ పుస్తకాలు సకాలంలో చేరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పాఠ్య, నోట్‌ పుస్తకాలను సకాలంలో విద్యార్థులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 1,795 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో 1,17,839 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 9,05,649 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకూ 1,44,093 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని ఆరు మండలాలకు పంపిస్తున్నారు. అలాగే, నోట్‌ పుస్తకాలు 7,88,900 అవసరం కాగా, 1,77,664 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని నాలుగు మండలాలకు చేరవేస్తున్నారు. అక్కడ నుంచి స్కూళ్లకు చేరవేయనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభించేలోగా అన్ని పుస్తకాలు పాఠశాలలకు పంపించనున్నారు. మిగిలిన కిట్లు వచ్చిన వెంటనే కొత్త విద్యా సంవత్సరంలో అడుగు పెట్టే విద్యార్థులకు అందిస్తారు. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు పరిశీలించారు. పుస్తకాలను భద్రత పరచాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

Updated Date - Apr 27 , 2025 | 11:39 PM