Share News

ప్రాజెక్టులు ఇక్కడ.. సర్కిల్‌ ఆఫీసు అక్కడ

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:34 PM

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందించడంతో పాటు వారికి ఏ సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపై ఉంది.

ప్రాజెక్టులు ఇక్కడ.. సర్కిల్‌ ఆఫీసు అక్కడ
బొబ్బిలిలో ఉన్న ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం

- బొబ్బిలిలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ విధులు

- పార్వతీపురంలో కొనసాగుతున్న ఈఈ కార్యాలయం

- సమస్యలు విన్నవించేందుకు రైతుల ఇబ్బందులు

- నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి

పార్వతీపురం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందించడంతో పాటు వారికి ఏ సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపై ఉంది. దీనికోసం ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఇతర అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి. కానీ, ఆ పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో ఇరిగేషన్‌ కార్యాలయం ఎక్కడ ఉందో అనేక మంది రైతులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం అక్కడ ఉన్న ఇరిగేషన్‌ కార్యాలయాన్ని తొలగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని ఒక ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కానీ, ఉన్నత ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు బొబ్బిలికి వెళ్లలేకపోతున్నారు. పార్వతీపురానికి వెళితే సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి లేకపోవడంతో ఆయకట్టు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


నాలుగేళ్లవుతున్నా ఇంతే..

పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయం బొబ్బిలిలోనే కొనసాగుతుంది. దీని పరిధిలోని ప్రాజెక్టులు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వెంగళరాయ సాగర్‌, పెదంకలాం, పెద్దగెడ్డ రిజర్వాయరు తదితర ప్రాజెక్టులు బొబ్బిలి సర్కిల్‌లో ఉన్నాయి. జిల్లాలో ఇరిగేషన్‌ శాఖపై రాష్ట్ర మంత్రులు గానీ, ఉన్నతాధికారులు గానీ సమీక్షలు నిర్వహిస్తే కేవలం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి మాత్రమే హాజరవుతున్నారు తప్ప సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ హాజరు కావడం లేదు. దీనివల్ల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. బొబ్బిలి సర్కిల్‌ కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి పార్వతీపురం కంటే బొబ్బిలి తక్కువ దూరంలో ఉంటుంది. వారి సౌలభ్యం కోసమే బొబ్బిలిలోనే సర్కిల్‌ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురంలో ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు రైతులు విన్నవించినా ఫలితం శూన్యం. కూటమి ప్రభుత్వమైనా స్పందించి మన్యం జిల్లాలో ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

పడకేసిన ప్రాజెక్టులు..

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్‌ శాఖ పూర్తిగా గాడితప్పింది. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పెండింగ్‌ పనులు చేయడానికి నిఽధులు కేటాయించకపోవడంతో పనులు పడకేశాయి. జపాన్‌ నుంచి అప్పు తెచ్చుకున్న నిధులను కూడా జగన్‌ సర్కారు తన అవసరాల కోసం వినియోగించుకుంది. ఫలితంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో వెంగళరాయ సాగర్‌, పెదంకలాం, వట్టిగెడ్డ ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా మంజూరైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో పనులు చేపడితే కొంతవరకైనా ప్రాజెక్టులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు బాగుపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:34 PM