MLA Baby Nayana: స్పందించి.. ముందుకొచ్చి
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:48 AM
MLA Baby Nayana: ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని రెండు పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇచ్చిన పిలుపునకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన స్పందించారు.
- బొబ్బిలి గురుకులాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన
- విద్యాశాఖ మంత్రి లోకేశ్ పిలుపుతో అభివృద్ధికి కంకణం
- పాఠశాల రూపురేఖలు మారుస్తానని హామీ
బొబ్బిలి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని రెండు పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇచ్చిన పిలుపునకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన స్పందించారు. ఎన్టీఆర్ హయాంలో మంజూరైన బొబ్బిలి ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను దత్తత తీసుకునేందుకు ముందుకువచ్చారు. ఈ మేరకు గురుకులాన్ని శనివారం సందర్శించారు. తరగతి గదులు, డార్మెటరీ, పరిపాలనా గదులు, విద్యార్థుల బాత్‌రూమ్‌లు, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. సరిపడ స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే కుళాయిల దగ్గర స్నానాలు చేస్తున్నట్లు గుర్తించారు. పక్కనే ఉన్న పాడుబడిన భవనాలను ఆధునీకరించి వాటిని బాత్‌రూమ్‌లు లేదా ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. విద్యార్థులతో రహస్యంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారు ముందుకురాకపోవడంతో గురుకుల ఆవరణలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తానని తెలిపారు. విద్యార్థులు నిర్భయంగా తమ సమస్యలను రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలన్నారు. పెట్టె తాళం తనవద్దే ఉంటుందన్నారు. గురుకులంలో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులెంతమంది పనిచేస్తున్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అని ఆరా తీశారు. నాన్‌టీచింగ్ స్టాఫ్ పనితీరుపై తనకు వ్యక్తిగతంగా అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే సరిచేసుకోవాలని హెచ్చరించారు. రాత్రివేళ కాపలాదారు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఆహార నాణ్యత, వైద్యసేవలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని తెలుసుకొని తక్షణం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పూర్వవిద్యార్థుల సహకారంతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, దాతల సహకారంతో అన్ని సదుపాయాలు కల్పించి గురుకులం రూపురేఖలు మారుస్తానని తెలిపారు. ప్రతీ నెలా రెండు దపాలు కచ్చితంగా సమావేశమై పాఠశాల అవసరాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ప్రతిపాదనలు పంపిస్తానని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని మరింతగా అభివృద్ధి చేసి అన్ని రకాల క్రీడలను విద్యార్థులతో ఆడించాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడా పరికరాలను తాను స్వయంగా సమకూరుస్తానని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రఘునాథ్, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది, టీడీపీ నాయకులు ఉన్నారు.