Shrunken... and Lost Its Shape కుదించుకుపోయి.. రూపు కోల్పోయి!
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:45 PM
Shrunken... and Lost Its Shape జిల్లా కేంద్రం పార్వతీపురంలో పురాతన చెరువులు, కోనేరులు ఆనవాళ్లను కోల్పోతున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కి కుదించుకుపోతున్నాయి. చెరువు గట్లపై ఆవాసాలు పెరిగిపోతున్నా.. రెవెన్యూ, మున్సిపల్ ప్రణాళిక విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కానరాని పరిరక్షణ చర్యలు
రెచ్చిపోతున్న ఆక్రమణదారులు
కలుషితమవుతున్నా పట్టించుకునే వారేరీ..?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటి అభివృద్ధికి ప్రణాళికలు
వైసీపీ పాలనలో తూతూమంత్రంగా పనులు.. ప్రజాధనం వృథా
చొరవ చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో పురాతన చెరువులు, కోనేరులు ఆనవాళ్లను కోల్పోతున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కి కుదించుకుపోతున్నాయి. చెరువు గట్లపై ఆవాసాలు పెరిగిపోతున్నా.. రెవెన్యూ, మున్సిపల్ ప్రణాళిక విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలో కొనేరులను తవ్వించడమే కాకుండా సుందరీకరణకు అప్పట్లో జమీందార్లు, దాతలు ఎంతో కృషి చేశారు. అంతే కాకుండా 1950 వరకు కోనేరుల నీటినే ప్రజలు తాగేందుకు ఉపయోగించే వారు. 1959లో పార్వతీపురం మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత అప్పటి పార్లమెంట్ సభ్యులు వైరచర్ల చూడామణి దేవ్ తాగునీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. కోనేరుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. అయితే కాలక్రమంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా జిల్లా కేంద్రంలో చెరువులు, కోనేరులు పూర్వ వైభవాన్ని కోల్పోయి అధ్వానంగా మారాయి. వాటిపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
కబ్జాలతో కుదించుకుపోతూ..
- నివాసాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాల నిర్మాణంతో పట్టణంలో బోటువాని చెరువు ఉనికి కోల్పోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దాని సుందరీకరణకు పాలకవర్గం ఆమోదముద్ర వేసినప్పటికి అది కాగితాలకే పరిమితమైంది.
- జగన్నాథపురంలోని పాత్రుడు కోనేరు చుట్టూ ఇదే పరిస్థితి నెలకొంది. గట్టు చుట్టూ నివాసాలు ఏర్పడ్డాయి. అక్రమ నిర్మాణాలు తొలగించి, సుందరీకరణ చేపట్టాలని ఆ ప్రాంతవాసులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
- పట్టణ నడిబొడ్డులో ఉన్న అమ్మిగారి కోనేరు అభివృద్ధికి 2012 సాధారణ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినప్పటికి అవి కూడా కాగితాలకే పరిమితమయ్యాయి.
కలుషితమవుతూ..
ఒకప్పుడు జిల్లా కేంద్ర ప్రజల దాహార్తి తీర్చి.. వ్యవసాయ భూములకు సాగునీరు అందించిన చెరువులు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నాయి. వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండి కలుషితమవుతున్నాయి. రోజురోజకూ అధ్వానంగా మారుతున్నాయి. జగన్నాఽథపురం పాత్రుడు కోనేరు, ఎస్‌ఎన్‌ఎం నగర్ సమీపంలోని అమ్మగారి కోనేరు, బోటువాని చెరువు, కొత్తవలస నవదుర్గా ఆలయానికి ఆనుకొని ఉన్న చెరువులు రూపును కోల్పోయాయి. దుర్వాసనలతో పాటు దోమలకు నిలయంగా మారాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో..
పట్టణంలో చారిత్రక చెరువుల అభివృద్ధికి 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. బోటువాని చెరువు, పాత్రుడు కోనేరు, అమ్మిగారి కోనేరు, నవదుర్గా ఆలయం సమీపంతో పాటు బెలగాంలో లంకెల చెరువు అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. అప్పట్లో సుమారు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు జరిగినప్పటికీ పాలకుల పర్యవేక్షణ లోపం, అధికారులు అశ్రద్ధ కారణంగా పనులు ముందుకు సాగలేదు. 2016లోనూ చెరువుల సుందరీకరణకు ప్రతిపాదనలు పంపాలని అప్పటి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించింది. ఎవరి నిర్లక్ష్యమో ఏమో కాని పనుల్లో మాత్రం ఎటువంటి పురోగతి లేదు.
వైసీపీ పాలనలో ...
గతవైసీపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధి, సుందరీకరణపై దృష్టి సారించలేదు. పైగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చెరువుల పరిరక్షణకు మంజూరైన నిధులను దారిమళ్లించారనే ఆరోపణలు న్నాయి. వైసీపీ ప్రభుత్వ ఏర్పడ్డ తొలి ఏడాదిలోనే జిల్లా కేంద్రంలో కొత్తవలస నవదుర్గా ఆలయ చెరువుతో పాటు పాత్రుడు, అమ్మిగారి కోనేరుల అభివృద్ధికి సుమారు రూ.1.4. కోట్లు విడుదల య్యాయి. అయితే నవదుర్గా ఆలయ చెరువు అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.62 లక్షలు మాత్రమే కేటాయించారు. తూతూ మంత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. చెరువు కలుషితమై దుర్వాసన వెలువడగా.. చిన్నలు, పెద్దలు అక్కడ కూర్చోడానికి కూడా ఇష్టపడడం లేదు. ఆహ్లాదకర వాతావరణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాగితాలకే పరిమితం..
జిల్లా కేంద్రంలో చెరువుల అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితమైంది. కొత్తవలస నవదుర్గా ఆలయం వద్ద చెరువుతోపాటు అమ్మిగారి కోనేరు, పాత్రుడు కోనేరు, బోటువాని చెరువు, బెలగాం లంకె చెరువులను అభివృద్ధి చేయాల్సి బాద్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది.
- పి. సన్యాసిరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి
=======================================
ఆదేశాలు రాలేదు..
జిల్లా కేంద్రంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వాటిపై ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆదేశాలిస్తే చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరాజు, డీఈఈ, పార్వతీపురంమున్సిపాల్టీ