Stage Set for No-Confidence Motion అవిశ్వాసానికి రంగం సిద్ధం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:09 AM
Stage Set for No-Confidence Motion పార్వతీపురం పట్టణంలో సోమవారం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గణేష్‌లపై అవిశ్వాసం తీర్మానం ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు జాయింట్ కలెక్టర్ శోభిక, కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లుకు నోటీసులు అందించారు.

జాయింట్ కలెక్టర్, కమిషనర్‌కు నోటీసు ఇచ్చిన ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్లు
పార్వతీపురం, మార్చి24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణంలో సోమవారం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గణేష్‌లపై అవిశ్వాసం తీర్మానం ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ కౌన్సిలర్లు జాయింట్ కలెక్టర్ శోభిక, కమిషనర్ సీహెచ్.వెంకటేశ్వర్లుకు నోటీసులు అందించారు. అంతక ముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కౌన్సిలర్లు రణభేరి బంగారునాయుడు, చిన్నమనాయుడు తదితరులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అనంతరం ప్రస్తుత పాలకవర్గం, చైర్‌పర్సన్ , వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నోటీసు అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి సంబంధించి కౌన్సిలర్ల సంతకాలు సేకరించిన తర్వాత వారంతా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత కమిషనర్, ఆ తర్వాత జేసీకి నోటీసులు, సంతకాల పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయ ప్రకాష్ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కె.మధుసూదనరావు, కె.నారాయణరావు, జి.రవికుమార్, సునీల్, ఎం.వెంకటేష్, రాజశేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పురపాలక సంఘంపై టీడీపీ జెండా!
పార్వతీపురంలో 30 వార్డులు ఉండగా.. గతంలో వైసీపీ కౌన్సిలర్లు 22 మంది, ఐదుగురు టీడీపీ , ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఉండేవారు. ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఇప్పటి వరకు టీడీపీలోకి సుమారు 13 మంది వైసీపీ కౌన్సిలర్లు చేరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 18కి చేరింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎమ్మెల్యేతో కలిపి టీడీపీ సభ్యుల సంఖ్య 22కు చేరింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం పురపాలక సం ఘంపై టీడీపీ జెండా ఎగిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ల పదువులను దక్కించుకునే చాన్స్ ఉంది. మెజార్జీ వైసీపీ కౌన్సిలర్లలో ఒక్కొక్కరూ టీడీపీలో చేరడంతో అవిశ్వాసంలో తెలుగుదేశం పార్టీకి విజయం పక్కా అనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
విజయం సాధిస్తాం...
గత నాలుగేళ్లుగా పార్వతీపురం పురపాలక సంఘం కనీస అభివృద్ధికి నోచుకోలేదు. పురోగతికి మేము ప్రయత్నిస్తున్నప్పటికీ వైసీపీ నాయకుల వైఖరి మారడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గంపై 20మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు.’ అని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనకు మద్దతనిస్తూ పార్వతీపురం పురపాలక సంఘంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. వారందరి మద్దతుతో పార్వతీపురాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ పురపాలక సంఘంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ’ అని చెప్పారు.